ఇక క్రెడిట్ కార్డ్ పొందటం అంత ఈజీ కాదు.. రూటు మార్చేసిన బ్యాంక్స్

ఇక క్రెడిట్ కార్డ్ పొందటం అంత ఈజీ కాదు.. రూటు మార్చేసిన బ్యాంక్స్

భారతీయ రిటైల్ లోన్స్ మార్కెట్‌లో ఒకప్పుడు జోరుగా సాగిన క్రెడిట్ కార్డ్ ఇష్యూ ఇప్పుడు నెమ్మదించింది. గత ఏడాది కాలంగా అన్-సెక్యూర్డ్ లోన్స్ విషయంలో బ్యాంకులు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్త క్రెడిట్ కార్డుల జారీ గత ఏడాదితో పోలిస్తే 15 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రిటైల్ రంగంలోని దాదాపు అన్ని విభాగాలు వృద్ధిని నమోదు చేస్తుంటే.. క్రెడిట్ కార్డ్ విభాగం మాత్రం తిరోగమనంలో ఉండటం గమనార్హం. 

గతంలో విచ్చలవిడిగా కార్డులు జారీ చేయడంతో, రికవరీ విషయంలో బ్యాంకులు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాయి. అందుకో ప్రస్తుతం కొత్త కార్డుల జారీ జోరును కొంత తగ్గించాయి. అలాగే టూ-వీలర్ లోన్స్, కమర్షియల్ వాహనాల ఫైనాన్సింగ్, మైక్రో లోన్ల విభాగాల్లో ఒత్తిడి కనిపిస్తుండటంతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి.

'ప్రీమియమైజేషన్' వైపు అడుగులు..
క్రెడిట్ కంపెనీలు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. చిన్న మొత్తాల రుణాలు లేదా కొత్తగా అప్పు తీసుకునే వారి కంటే.. గతంలో మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న 'ప్రైమ్' కస్టమర్లపైనే బ్యాంకులు ఎక్కువగా వ్యాపారం కోసం దృష్టి సారిస్తున్నాయి. దీనినే ఆర్థిక నిపుణులు "ప్రీమియమైజేషన్" అని పిలుస్తున్నారు. అంటే ఎక్కువ ఆదాయం ఉండి.. సక్రమంగా చెల్లింపులు చేసే వారికే పెద్ద మొత్తంలో క్రెడిట్ లిమిట్ ఇచ్చేందుకు బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయని తేలింది.

వినియోగదారులపై ప్రభావం..
బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ విషయంలో తీసుకున్న నిర్ణయ మార్పులతో కొత్తగా కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇన్కమ్ ప్రూఫ్, సిబిల్ స్కోర్ విషయంలో బ్యాంకులు గతంలో కంటే కఠినంగా వ్యవహరిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ విభాగంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా రిటైల్ రుణాల నాణ్యత స్థిరంగా ఉండటం సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి బ్యాంకులు ఇప్పుడు 'వేగం' కంటే 'సేఫ్టీ'కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అప్పు తీసుకునే వారు తమ క్రెడిట్ క్రమశిక్షణను కాపాడుకుంటేనే భవిష్యత్తులో సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.