- వేణుమాధవ్ ను ఎందుకు కిడ్నాప్ చేశారు?
- రాధాకిషన్ రావును ప్రశ్నించిన జూబ్లీహిల్స్ పోలీసులు
- నేటితో ముగియనున్న కస్టడీ
హైదరాబాద్, వెలుగు:ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఓ కిడ్నాప్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు విచారి స్తున్నారు. బుధవారం రెండో రోజు కస్టడీలో కీలక సమాచారం సేకరించారు. గురువారంతో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలు కు తరలించనున్నారు.
క్రియా హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్‌ను కిడ్నాప్ చేసి రూ.40 కోట్ల విలువైన షేర్లు బదిలీ చేయించారని రాధాకిషన్ రావు సహా మరో ఐదుగురు పోలీసులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్‌గూడ జైలులో ఉండడంతో ఆయన్ను పీటీ వారెంట్‌పై కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ ఆఫీసులో ఏంజరిగింది
క్రియా హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు వేణుమాధవ్‌కు చెందిన కంపెనీల వివాదాల గురించి పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది. బాధితుడు వేణుమాధావ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రాధాకిషన్‌రావును ప్రశ్నించారు. క్రియా కంపెనీలో మిగితా డైరెక్టర్లతో రాధాకిషన్ రావుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయని ఆరా తీశారు. ఈ క్రమంలోనే 2018 నవంబర్ 22న ఖాజాగూడలో జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారం రాధాకిషన్ నుంచి రికార్డ్ చేసినట్లు తెలిసింది.
వేణుమాధవ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో స్పాట్‌లో ఎవరెవరు ఉన్నారు. వారికి ఆదేశాలు ఎవరు ఇచ్చారని ఆరా తీసినట్లు సమాచారం. సికింద్రాబాద్లోని టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లిన తరువాత షేర్లు ఎలా బదిలీ చేయించారనే వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.
