సీఎంఆర్ మింగిన మిల్లర్లు!

సీఎంఆర్ మింగిన మిల్లర్లు!
  • ఖమ్మం జిల్లాలో రూ.200 కోట్లకు పైగా పక్కదారి పట్టిన బియ్యం  
  • సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో బట్టబయలు
  • మిల్లర్లు, ఆఫీసర్లపై రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ కు మంత్రి తుమ్మల ఆదేశం 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పక్కదారి పట్టింది.  గతేడాది వానాకాలంలో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు,  బియ్యం తిరిగి ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారు. ఇటీవల జిల్లాలో హైదరాబాద్ సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో మిల్లర్ల బాగోతాలు బయటపడ్డాయి. కొణిజర్ల మండలం లాలాపురంలోని ఎస్ఏఆర్ మిల్లులో చేసిన తనిఖీల్లో  రూ .65 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని తేల్చారు. దీంతో 25శాతం పెనాల్టీతో రూ.82 కోట్లు కట్టాలని అధికారులు ఆదేశించారు. దీంతోపాటు మిల్లు ఓనర్ పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.


మరో రెండు మిల్లులు గడువు కావాలంటూ కోర్టును ఆశ్రయించాయి.  ఇంకో రెండు మిల్లులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ స్థానంలో ఒక మిల్లు కోటి రూపాయలు, మరొక మిల్లు రూ.50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. రూ. కోటి చెల్లించిన ఓనర్ మరో రూ. 8 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇంకో మిల్లు యజమాని రూ. 3 కోట్లు కట్టాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

 మంత్రి తుమ్మల సీరియస్

 జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం, మిల్లర్ల ఇష్టారాజ్యంతో రూ. కోట్లాది విలువైన ధాన్యం అక్రమార్కుల చేతిలోకి వెళ్లడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ను జిల్లాలో  అక్రమంగా ధాన్యం తరలింపుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ప్రత్యేక అధికారులతో లోతైన విచారణ చేపట్టి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారని, దీనిలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా రూల్స్ కచ్చితంగా పాటించాలని స్పష్టంచేశారు.  పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్ నమోదు చేయాలని కలెక్టర్ కు సూచించారు.