మెదక్ (శివ్వంపేట), వెలుగు: మెదక్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. దాదాపు రూ.77 కోట్ల బియ్యం పక్కదారి పట్టిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్విధించిన గడువు ముగిసినా మిల్లర్లు టార్గెట్ మేరకు సీఎంఆర్ సప్లై చేయలేదు. 2021–22 వానాకాలం, 2022–23 యాసంగి సీజన్ లకు సంబంధించి 3.86 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్ లో ఉంది.
ఈ నేపథ్యంలో ఇటీవల విజిలెన్స్ టీమ్ లు నర్సాపూర్ డివిజన్ లోని నాలుగు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాయి. వేలాది క్వింటాళ్ల సీఎంఆర్ సప్లై చేయకపోగా, ధాన్యం నిల్వలు కూడా లేనట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాలో జిల్లాలోని రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్పెట్టిన గడువు ముగిసినా.. చాలా మంది మిల్లర్లు టార్గెట్ మేరకు సీఎంఆర్ సరఫరా చేయలేదు.
గడచిన మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 6,95,024 మెట్రిక్ టన్నులుసరఫరా చేయాల్సి ఉండగా 3,25,885 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 3,69,138 మెట్రిక్ టన్నుల సీఎంఆర్పెండింగ్ లో ఉంది. గత మూడు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ పెద్ద మొత్తంలో పెండింగ్ ఉండగా, త్వరలో మరో సీజన్ ధాన్యం మిల్లులకు చేరనుంది.
మూడు సీజన్లుగా అదే పరిస్థితి..
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు సరఫరా చేస్తుంది. వారు ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌చేసి క్వింటాలుకు 67 కిలోల బియ్యాన్ని సీఎంఆర్ కింద సరఫరా చేయాలి. అయితే చాలా మంది మిల్లర్లు సీఎంఆర్సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరసగా మూడు సీజన్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేరు. 2021–22 వానాకాలం సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న 3,87,733 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 157 రైస్ మిల్లలకు పంపారు.
దానికి సంబంధించి మిల్లర్లు 2,59,781 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ సరఫరా చేయాల్సి ఉండగా 2,33,610 మెట్రిక్ టన్నులు (90 శాతం) సరఫరా చేశారు. ఇంకా 26,171 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది. 2021–22 యాసంగి సీజన్లో 2,58,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 135 రైస్ మిల్లులకు పంపారు. దానికి సంబంధించి 1,75,540 మెట్రిక్ టన్నుల సీఎంఆర్సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 89,752 మెట్రిక్ టన్నులు (51 శాతం) మాత్రమే సరఫరా చేశారు.
ఇదే కాకుండా ఇంకా 85,788 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. 2022–23 వానాకాలం సీజన్లో 3,87,615 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 136 మిల్లులకు పంపారు. 2,59,702 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను సరఫరా చేయాల్సి ఉండగా అందులో కేవలం 2,523 మెట్రిక్ టన్నులు ( ఒక శాతం) మాత్రమే సరఫరా చేశారు. ఇంకా 2,57,179 మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉంది.
టాస్క్‌ఫోర్స్ హెచ్చరించినా
గత నెల 10న హైద్రాబాద్నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ టీం మెదక్, పాపన్నపేట మండలం ఎల్లాపూర్, లక్ష్మీనగర్, గాంధారిపల్లి, మండల కేంద్రం కొల్చారం, నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోని రైస్ మిల్లులను తనిఖీ చేసింది. గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ ను నెలాఖరులోగా సరఫరా చేయాలని, లేకుంటే 125 శాతం ఫెనాల్టీ పడుతుందని హెచ్చరించారు. అయితే గడువు పూర్తయినా జిల్లాలోని చాలా రైస్ మిల్లులు సీఎంఆర్పెండింగ్ లో ఉంది.
60 రోజుల్లో సరఫరా చేయాల్సి ఉన్నా..
కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు వడ్లు చేరిన తర్వాత 45 నుంచి 60 రోజుల్లో మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ ను అప్పగించాలి. కానీ నిర్ధేశిత గడువు పూర్తయినా చాలా మంది మిల్లర్లు సీఎంఆర్ టార్గెట్పూర్తి చేయలేదు. గత నెల 31తో సీఎంఆర్ సరఫరా చేయాల్సిన గడువు ముగిసింది. అయినా చాలా మంది మిల్లర్లు టార్గెట్మేరకు సీఎంఆర్ ఇవ్వలేదు.
అనేక మిల్లుల వద్ద పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వలు పేరుపోయి ఉండటంతో టార్గెట్ మేరకు సరఫరా చేయడానికి చాలా రోజుల సమయం పట్టేలా ఉంది. ఇది త్వరలో ప్రారంభం కానున్న యాసంగి సీజన్ధాన్యం కొనుగోలుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. టార్గెట్మేరకు సీఎంఆర్ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా సివిల్సప్లయ్ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అక్రమాలు ఇలా..
కొనుగోలు కేంద్రాల నుంచి నర్సాపూర్ మండలంలోని మూడు రైస్ మిల్లులకు సరఫరా చేసిన రూ.57 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ ఆఫీసర్లు గుర్తించారు. అలాగే శివ్వంపేట మండలంలోని ఒక రైస్ మిల్ లో రూ.20 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఆయా రైస్ మిల్లుల వారు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. ఇటు మిల్లులోనూ ధాన్యం లేదు.
దీన్ని బట్టి ధాన్యాన్ని వారు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయా రైస్ మిల్లర్లు కోట్లాది రూపాయల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలినా ఆఫీసర్లు వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సదరు మిల్లర్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
