దేనికైనా గూగుల్  రేటింగే చూస్తున్నరు

దేనికైనా గూగుల్  రేటింగే చూస్తున్నరు
  • హోటళ్ల నుంచి హాస్పిటళ్ల సేవల దాకా రివ్యూలు చూసి పోవుడే
  • రేటింగ్స్, రివ్యూలు ఇవ్వాలని కస్టమర్లను కోరుతున్న సంస్థలు
  • ఫ్రీ పబ్లిసిటీ, ఖర్చు లేకుండా ప్రమోషన్ అవుతుండటంతో ఇంట్రస్ట్​  

హైదరాబాద్, వెలుగు: ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయగానే డెలివరీ చేసిన వ్యక్తి ముందు అడిగే మాట ‘సార్.. జర మంచి రేటింగ్ ఇవ్వండి’ అని. ఏదైనా షాప్​కు పోతే కూడా ‘మేడమ్​.. మొబైల్​కు లింక్​ వస్తది. ఫైవ్​స్టార్​ రేటింగ్​ఇవ్వండి’ అని అడుగుతుంటరు. వస్తువులేమైనా కొన్నా కూడా రేటింగ్ కోసం ఫోన్​కు సెకన్లలో రిక్వెస్ట్ వస్తుంటుంది. టెస్టు కోసం ల్యాబ్​కు వెళ్లి రేటింగ్ ఇవ్వడం మర్చిపోతే ఫోన్ చేసి మరీ రేటింగ్ తీసుకుంటరు. అంతెందుకు.. మన ఇంటి దగ్గర్లో ఉండే కిరాణ షాపు ఓనర్ కూడా గూగుల్ రేటింగ్ ఇవ్వమంటున్నడు. ప్రస్తుతం అన్ని రకాల సర్వీసుల్లోనూ ఇదే ట్రెండ్. రోడ్​సైడ్​ బిజినెస్ నుంచి రెస్టారెంట్ల దాకా.. హోటళ్ల నుంచి హాస్పిటళ్ల దాకా రేటింగ్, రివ్యూ కోసం రిక్వెస్ట్ చేస్తున్నరు. కొనుగోళ్లను, బిజినెస్​లను అంతలా ఇవి ఇంపాక్ట్​ చేస్తున్నయ్​. కస్టమర్లు ప్రతిదీ గూగుల్​ రేటింగ్ చూసి ఆర్డర్​ చేయడం పెరిగింది మరి.

కొనే వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడైతే బాగుంటుంది, క్వాలిటీ ఎట్లుంటుంది లాంటివన్నీ జనాలు గూగుల్​లో సెర్చ్​చేస్తున్నారు. కరోనా తర్వాత ఇది మరింత పెరిగింది. ఫ్రీ పబ్లిసిటీ, ఖర్చు లేకుండా ప్రమోషన్ అవుతుండటంతో బిజినెస్​ ఓనర్లు కూడా రేటింగ్స్, రివ్యూల కోసం పోటీ పడుతున్నరు. ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, బ్రాండెడ్​ ప్రొడక్టులకే పరిమితమైన గూగుల్​ రేటింగ్స్ ఇపుడు అంతటా వ్యాపించాయి. 

రేటింగ్ కోసం గూగుల్ లో అకౌంట్ తీయాలె

ఆన్​లైన్​లో బిజినెస్ మొదలుపెట్టే వాళ్లు ఓ అకౌంట్ తెరిచినట్లే.. రేటింగ్ కావాలనుకునే వాళ్లు గూగుల్ లో లిస్టింగ్ అకౌంట్ తెరుస్తారు. ఆ తర్వాత రీడర్లు స్టార్​రేటింగ్, రివ్యూల రూపంలో ఇచ్చే ఫీడ్​బ్యాక్ ప్రకారం ఆ వస్తువు, సర్వీసు రేటింగ్ డిసైడ్ అవుతుంది. 5 స్టార్ల రూపంలో రేటింగ్​లో 4.5 నుంచి 5 స్టార్లుంటే సూపర్ క్వాలిటీగా భావిస్తారు. 3.5 రేటింగ్ ఉన్న ఏ వస్తువు లేదా సర్వీస్ అయినా మంచిదేనని ఐటీ ఎక్స్ పర్ట్స్​చెబుతున్నారు. రేటింగ్​తో పాటు రివ్యూలు కూడా ఏదైనా వస్తువుపై నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడతాయంటున్నారు. అందుకే చాలా మంది తాము కొనాలకున్న వస్తువు, లేదా పొందాలనుకున్న సర్వీసుపై జనం ఎలాంటి రివ్యూలు పెట్టారో గమనిస్తున్నారు.

గూగుల్​ జోక్యమూ ఉంటది

ఒక ప్రొడక్టుకు వందల్లో రివ్యూలు ఉండి ఎక్కువ రేటింగ్ ఉండొచ్చు. మరో ప్రొడక్టుకు వేలల్లో రివ్యూలు ఉన్నా రేటింగ్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి రివ్యూల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. గూగుల్ మై బిజినెస్​లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ ను ఆ సంస్థ కూడా రివ్యూ చేసి రేటింగ్ ఇస్తుంటుంది. జనం ఇచ్చే రివ్యూలే ప్రొడక్టు క్వాలిటీని డిసైడ్ చేయవు. గూగుల్​ కూడా జోక్యం చేసుకుంటుంది. ఒక ప్రొడక్ట్​ రేటింగ్​ను డిసైడ్​ చేయడానికి రీసెన్సీ (ఎంత కొత్తది), ఫ్రీక్వెన్సీ (ఎంత తరచుగా), క్వాంటిటీ (ఎన్ని రివ్యూలు), క్వాలిటీ (రివ్యూలోని నాణ్యత)ని పరిగణనలోకి తీసుకుంటారు. దీని ఆధారంగా రేటింగ్​లో మార్పులు జరుగుతాయి.  

కాస్త స్మార్ట్​గా ఆలోచించాలె: ఎక్స్ పర్ట్స్​

వస్తువులు, సర్వీసుల విషయంలో రేటింగ్స్​పై ఆధారపడటం ప్రస్తుత లైఫ్ స్టయిల్ లో తప్పట్లేదనడంలో సందేహం లేదని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ప్రస్తుతం రోజూ ఏదో ఒక వస్తువును కొంటున్నామని, సిటీలో ఏదో ఒక సర్వీసు గురించి ఎంక్వైరీ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. గతంలోలా ఎవరినో అడిగి తెలుసుకునే పరిస్థితి లేదని అంటున్నారు. సెల్ లో కీవర్డ్ కొడితే పూర్తి ఇన్ఫర్మేషన్ మన ముందు ఉంటుందని.. కాబట్టి గూగుల్ రేటింగ్, రివ్యూలు చూసి నిర్ణయాలు తీసుకోక తప్పని ఈ రోజుల్లో కొంచెం స్మార్ట్​గా ఆలోచిస్తే మంచిదని సూచిస్తున్నారు.

గుండు సూది నుంచి విమాన ప్రయాణం దాకా...

ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే అంతకు ముందు కొన్నోళ్లను అడిగి తెలుసుకునేవాళ్లం. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అక్కడి వివరాలు, సౌలతులు ఎలాగున్నాయో ముందే పోయివచ్చిన వాళ్లను కనుక్కునేవాళ్లం. ఇప్పుడా పద్ధతి పోయింది. గుండు సూది కొనడం నుంచి విమాన ప్రయాణం దాకా ఏ సర్వీస్​కావాలనుకున్నా గూగుల్​లో సెర్చ్​ చేసి రేటింగ్, రివ్యూలు చూడటం ఎక్కువైంది. వాటి ప్రకారం ఏది కొనాలో, ఏది పక్కనబెట్టాలో నిర్ణయించుకోవడం పెరిగింది.

లాభం, నష్టం రెండూ ఉన్నయ్​

మనం ఫీడ్​బ్యాక్​ కోసం గూగుల్​పై ఆధారపడితే లాభం, నష్టం రెండూ ఉన్నాయి. మనం పెట్టే రివ్యూల్ని గూగుల్ క్రాస్ చెక్​ చేస్తుంది. పది మందిని అడగనవసరం లేకుండా గూగుల్​ రేటింగ్​ చూసి ఓ నిర్ణయానికి రావచ్చు. అలాగని ప్రతి రేటింగ్ వంద శాతం కరెక్ట్​ అని చెప్పలేం.   
‑ చింతకింది విశ్వనాథ్, ఎథికల్ హ్యాకర్​ 

గూగుల్  రేటింగ్స్ మార్చొచ్చు

గూగుల్ రేటింగ్ లు, రివ్యూలను మార్చే అవకాశం ఉంటుంది. రివ్యూల్లో వినియోగదారులు రాసినవి, ఎక్స్ పర్ట్ రాసినవని రెండు రకాల ఉంటాయి. మామూలుగా జనం ఇచ్చే రివ్యూల్లో నెగెటివ్ రిపోర్ట్ ఉంటే ఆ బిజినెస్ రన్ చేసే వాళ్లు రిక్వెస్ట్ చేసి ఒపీనియన్ మార్పిస్తారు. ఎక్స్ పర్ట్ రివ్యూల్లో ఆ ఎక్స్​పర్ట్​కు ఎంతో కొంత ఇస్తారు కాబట్టి మంచి రివ్యూలే రాస్తారు. అందుకే ఈ క్రౌడ్​ సోర్సింగ్ రివ్యూలు కరెక్టుగా ఉండవు.  
‑ నలమోతు శ్రీధర్, ఐటీ ఎక్స్ పర్ట్​

రేటింగ్స్ చూసి వస్తున్నరు

కరోనా తర్వాత డాక్టర్స్ రేటింగ్ చూసి ఓపీకి, ట్రీట్ మెంట్ కి రావటం ఎక్కువైంది. గతంలో 10 శాతం ఉంటే ఇపుడు 20 శాతానికి పెరిగింది. సిటీలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ కు రేటింగ్ ఇవ్వడం పెరిగింది. హాస్పిటళ్లల్లో కూడా రేటింగ్​ఇవ్వమని పేషెంట్లను, బంధువులను అడుగుతున్నరు.
‑ కె. సందీప్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్, 
సన్ షైన్ హాస్పిటల్స్, గచ్చిబౌలి