IND vs ENG 2025: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. పరుగుల వీరుడికి ఈ సారైనా ఛాన్స్ ఇస్తారా..?

IND vs ENG 2025: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. పరుగుల వీరుడికి ఈ సారైనా ఛాన్స్ ఇస్తారా..?

భారత దేశవాళీ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాళ్లలో ఉత్తరాఖాండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. లీగ్ ఏదైనా అభిమన్యు తన సూపర్ ఫామ్ కొనసాగిస్తాడు. 2015 నుంచి టెస్ట్ క్రికెట్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అయితే టీమిండియా ఎంట్రీ మాత్రం అతనికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా భారత జట్టు తరపున ఆడలేకపోతున్నాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అభిమన్యు ఈశ్వరన్ కు సెలక్టర్లు చోటు కల్పించారు. 

స్క్వాడ్ లో ఎంపికైనా అభిమన్యు ఈశ్వరన్ కు తుది జట్టులో నిరాశే ఎదురైంది. ప్లేయింగ్ 11లో అతడికి ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడంతో అభిమన్యు బ్యాకప్ ఓపెనర్ గానే జట్టులో కొనసాగాడు. శుక్రవారం (జూన్ 20) నుంచి జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ కు అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులో ఉండడానికి ఖచ్చితంగా అర్హుడు. లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ జరగబోతుంది. అయితే ఈ సారి కూడా అతడికి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం భారత జట్టులో మూడు, ఆరు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 

ఓపెనర్లుగా రాహుల్, జైశ్వాల్ బరిలోకి దిగడం ఖాయంగా మారింది. మిడిల్ ఆర్డర్ లో నాలుగో స్థానంలో గిల్, ఐదో స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ కు వస్తారని టీమిండియా వైస్ కెప్టెన్ కన్ఫర్మ్ చేశాడు. ఓపెనర్ కావడంతో ఆరో స్థానంలో ఈశ్వరన్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. దీంతో అతడికి కేవలం మూడో స్థానంలో మాత్రమే ఖాళీగా ఉంది. ఈ స్థానంలో సాయి సుదర్శన్ రేస్ లో ఉన్నాడు. వీరిద్దరిలో జట్టు యాజమాన్యం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. ఒకవేళ అభిమన్యుకు ఈ సారి కూడా అవకాశం రాకపోతే అంత కన్నా దురదృష్టవంతుడు ఇంకొకకరు ఉండరనే చెప్పాలి. 

గత ఏడాది జరిగిన దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలోనూ అభిమన్యు అసాధారణంగా రాణించాడు. ముఖ్యంగా ఇరానీ ట్రోఫీలో 191 పరుగుల భారీ స్కోర్ చేసి అదరగొట్టాడు.ఇప్పటివరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లు ఆడిన  అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్ తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో 19 పరుగులు చేసి విఫలమయ్యాడు. అయితే రెండో టెస్టుల్లో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 68.. రెండో ఇన్నింగ్స్ లో 80 పరుగులు చేసి రాణించాడు.