చెట్ల నరికివేత : ముంబైలో 144 సెక్షన్

చెట్ల నరికివేత : ముంబైలో 144 సెక్షన్

మెట్రో రైల్ షెడ్ కోసం ముంబయిలోని ఆరే కాలనీలో 2500కు పైగా చెట్లు నరికేస్తుండటంపై వివాదం ముదురుతోంది. మున్సిపల్ కార్పోరేషన్ తీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆరే లో చెట్లు కొట్టేయడాన్ని సుమోటోగా తీసుకుంది సుప్రీంకోర్టు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కు కొందరు స్టూడెంట్స్ లెటర్ రాశారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసును చేపట్టారు. కేసు విచారణకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఈ అంశాన్ని ఇవాళ విచారించనుంది.

ఆరే కాలనీలో చెట్ల తొలగింపునకు వ్యతిరేకంగా ఆరే కాలనీ ప్రజలతో పాటు… రాజకీయ నేతలు ఉద్యమిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఆరే కాలనీకి వెళుతున్న B R అంబేద్కర్ మనుమడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రకాశ్ అంబేద్కర్ ఆరోపించారు.

చెట్లు నరకవడం తప్పనిసరి అన్నారు ముంబయి మెట్రో ఎండీ అశ్విని భిడే. ఏదైనా కొత్తగా నిర్మిస్తున్నప్పుడు విధ్వంసం అనివార్యమని ఆమె ట్వీట్ చేశారు. అయితే అది కొత్త లైఫ్ కు, కొత్త సృష్టికి పునాదిలా పనిచేస్తుందని ట్వీట్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు బీజేపీ నేత కిరీట్ సోమయ్య. మెట్రో లేట్ అయితే ముంబయి ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు.

చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో  పోలీసులు అరెస్ట్ చేసిన 29 మంది ఉద్యమకారులకు బోరీవాలీ హాలీడే కోర్టు బెయిల్ ఇచ్చింది. 7వేల బెయిల్ బాండ్ ఇవ్వడంతో వారిని రిలీజ్ చేయాలని ఆదేశాలిచ్చింది కోర్టు. ఆరే కాలనీలో చెట్ల తొలగింపు మిత్రపక్షాల మధ్య చిచ్చు పెడుతోంది. చెట్ల నరికివేతను శివసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. బీజేపీ లీడర్లు సమర్ధిస్తున్నారు. అయితే  రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని కాంగ్రెస్,  ఎన్సీపీ ఆరోపిస్తోంది.