
- గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్ట్‌నూ పరిగణనలోకి తీసుకుంటే నీటి లభ్యత మరింత కష్టం
- కేంద్ర జలశక్తి శాఖకు ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడి
- గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 157 టీఎంసీల లోటు
- 50 శాతం డిపెండబిలిటీ ఆధారంగానే మిగులు జలాల లభ్యత
- సీడబ్ల్యూసీ ప్రకారం 387, ఎన్‌డబ్ల్యూడీఏ ప్రకారం 569 టీఎంసీలే లభ్యం
- ఆ మిగులు జలాలపై అన్ని రాష్ట్రాలకూ హక్కు
హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మించ తలపెట్టిన గోదావరి– బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్‌కు చుక్కెదురైంది. గోదావరిలో మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును చేపడుతున్నామని ఏపీ చెబుతున్నా.. అసలు అక్కడ మిగులు జలాలే లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వాటర్ బ్యాలెన్స్ స్టడీస్‌లో తేలినట్టు తెలిసింది. 75 శాతం డిపెండబిలిటీ (వందేండ్లలో 75 ఏండ్ల సగటు వరద) ఆధారంగా లెక్కిస్తే అసలు గోదావరి బేసిన్లో మిగులు జలాలే లేవని వెల్లడైంది. మిగులు జలాల లోటు ఉన్నట్టు తేటతెల్లమైంది. ఏపీ చేపట్టిన జీబీ లింక్ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖ.. సీడబ్ల్యూసీతోపాటు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ), జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీకి కొద్ది రోజుల క్రితం రిఫర్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మిగులు జలాల లెక్కలపై కొద్దిరోజుల క్రితమే కేంద్ర జలశక్తి శాఖకు ఎన్ డబ్ల్యూడీఏ రిప్లై ఇచ్చింది. ఆ రిప్లైలోనే అసలు గోదావరిలో మిగులు జలాలే లేవని స్పష్టం చేసినట్టు తెలిసింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా సీడబ్ల్యూసీ చేసిన వాటర్ బ్యాలెన్స్ స్టడీల్లో మిగులు జలాలే లేవని తెలిపినట్టు సమాచారం. అదే డిపెండబిలిటీ ఆధారంగా ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన స్టడీల్లో 157 టీఎంసీల లోటు ఉన్నట్టు తేల్చినట్టు తెలిసింది. అయితే, 50 శాతం డిపెండబిలిటీ ఆధారంగా చేసిన స్టడీల్లో మాత్రం సీడబ్ల్యూసీ లెక్క ప్రకారం కేవలం 387.75 టీఎంసీలు, ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క ప్రకారం 569 టీఎంసీలు మాత్రమే మిగులు జలాలున్నాయని స్పష్టం చేసినట్టు సమాచారం.
నీళ్లే లేనప్పుడు ప్రాజెక్టు ఎట్ల?
మామూలుగా అయితే నీళ్ల వాటాల పంపిణీ అయినా.. లేదంటే కొత్త ప్రాజెక్టుల నిర్మాణమైనా 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగానే చేపడుతుంటారు. దాని ప్రకారమైతే.. గోదావరిలో మిగులు జలాల మాటే లేదు. కానీ, ఏపీ మాత్రం మిగులు జలాల ఆధారంగానే ప్రాజెక్టును చేపడుతున్నామంటూ పదే పదే చెబుతున్నది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా పలుసార్లు ఇదే విషయం చెప్పారు. మరి, మిగులు జలాలే లేనప్పుడు.. అక్కడ ప్రాజెక్ట్మాత్రం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం జలదోపిడీకీ ఏపీ వేసిన్ స్కెచ్‌లో భాగమే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. మిగులు జలాలు లేకుండానే ప్రాజెక్టు కోసం ఫీజిబిలిటీ స్టడీస్ చేయించేందుకు ఏపీ వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నది. ప్రాజెక్టు వ్యయంపైనా త్వరలోనే పరిపాలనా అనుమతులు మంజూరు చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు చెబుతున్నారు. ప్రాజెక్టుకు అనుమతుల విషయంలోనూ ఎప్పుడూ ఎక్కడా లేని తీరులో ముందుకు వెళ్లాలని ఏపీ సర్కారు నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను పిలిచేందుకు కసరత్తు చేస్తున్నది. మామూలుగా అయితే ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వాలే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జీబీ లింక్ విషయంలో మాత్రం టెండర్ దక్కించుకున్న సంస్థనే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు అనుమతులు తీసుకొచ్చేలా నిబంధనలు పెట్టబోతున్నట్టు తెలిసింది.
ఎక్కడి నుంచి తీసుకుంటరో చెప్పలేదు
జీబీ లింక్ ప్రాజెక్టును రూ.80,112 కోట్లతో చేపడుతున్నట్టు ఏపీ చెబుతున్నా.. అసలు నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆ రాష్ట్రం ప్రతిపాదనల్లో చెప్పలేదని కేంద్రానికి ఎన్ డబ్ల్యూడీఏ తెలిపినట్టు సమాచారం. 2024 నవంబర్ 15న ఏపీ సీఎం రాసిన ప్రతిపాదన లేఖలో మాత్రం పోలవరం నుంచి లిఫ్ట్ చేస్తామని చెప్పినా.. ప్రత్యేకంగా ఏ పాయింట్ నుంచి తీసుకుంటారన్నది చెప్పలేదని తెలిసింది. మరోవైపు అసలు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వలేదని, పూర్తి వివరాలు లేకుండా ఆ ప్రాజెక్టుకు అంత ఖర్చవుతుందా? లేదా? అన్నది తేల్చాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. అంతేగాకుండా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి– కావేరి లింక్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉందని, ఆ ప్రాజెక్ట్‌ను చేపడితే అక్కడ మిగులు జలాల లెక్కల్లో మరింత తేడా వస్తుందని స్పష్టం చేసినట్టు సమాచారం. జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టాలంటే.. జీసీ లింక్ ప్రాజెక్టునూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్టు తెలిసింది.
ఆ నీళ్లపై అన్ని రాష్ట్రాలకూ హక్కు
వాటర్ బ్యాలెన్స్ స్టడీల్లో చేసిన మిగులు జలాల్లో.. గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకూ హక్కు ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖకు ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసినట్టు తెలిసింది. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్4 ప్రకారం.. రాష్ట్రాలకు కేటాయించిన నీళ్లలో ఆయా రాష్ట్రాలు తరలించుకునేందుకు అవకాశం ఉంటుందని, అయితే, మిగులు జలాల కేటాయింపుల విషయానికొస్తే ఇప్పుడు తేలిన లెక్కల ప్రకారం వాటా తగ్గుతుందని చెప్పినట్టు తెలిసింది. అంటే సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ స్టడీస్‌లో తేలిన మిగులు జలాలు 387.75 టీఎంసీలు, 569 టీఎంసీల్లో సంబంధిత రాష్ట్రాలు వాటాలుగా తీసుకోవాల్సి వస్తుందని, అలాంటప్పుడు ఏపీ 200 టీఎంసీల తరలింపు సాధ్యం అవుతుందా? అన్న దానిపై స్టడీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. 90 రోజులపాటు రోజూ 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోస్తే.. మిగతా రైపేరియన్ రాష్ట్రాల ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా కచ్చితత్వంతో కూడిన సమగ్రమైన హైడ్రాలజీ స్టడీస్ చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు సూచించినట్టు తెలిసింది.