కృష్ణా, గోదావరి నీళ్లు డేంజర్..నీళ్లలో స్థాయికి మించి ప్రమాదకర కోలిఫాం బ్యాక్టీరియా

కృష్ణా, గోదావరి నీళ్లు డేంజర్..నీళ్లలో స్థాయికి మించి ప్రమాదకర కోలిఫాం బ్యాక్టీరియా
  • నీళ్లలో స్థాయికి మించి ప్రమాదకర కోలిఫాం బ్యాక్టీరియా.. సీడబ్ల్యూసీ రిపోర్ట్​
  • కృష్ణాలోకి మానవ వ్యర్థాలు, గోదావరిలోకి పారిశ్రామిక వేస్టేజీ
  • ఖమ్మం జిల్లాలో 32 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా
  • ఈ నీళ్లు స్నానానికి, పశువులు తాగడానికి కూడా పనికిరావని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:   రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల పరిస్థితి దారుణంగా తయారైంది. పారిశ్రామిక, మానవ వ్యర్థాలు నేరుగా నదుల్లో కలుస్తుండడంతో ఆ నీళ్లు డేంజర్​ బెల్స్​ మోగిస్తున్నాయి.  సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) స్వయంగా ఈ  విషయాన్ని వెల్లడిచింది. ఈ నీళ్లలో కోలిఫాం బ్యాక్టీరియా మోతాదుకు మించి అనేక రెట్లు ఎక్కుగా ఉండడం వల్ల తాగడానికి, స్నానం చేయడానికి అస్సలు పనికిరావని  సీడబ్ల్యూసీ హెచ్చరించింది. 

కృష్ణాలో మల సంబంధ బ్యాక్టీరియా ఎక్కువగా కలుస్తున్నట్టు సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో  పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తేల్చింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని వైరా, మధిర ప్రాంతాల్లో కృష్ణా నదీ జలాలు ఎక్కువగా కలుషితమవుతున్నాయని స్పష్టంచేసింది. సెంట్రల్​ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​ (సీపీసీబీ) ప్రకారం వంద మిల్లీలీటర్ల నీటిలో 500 ఎంపీఎన్​ (మోస్ట్​ ప్రాబబుల్​ నంబర్​) వరకు టోటల్​ కోలిఫాం (టీసీ) బ్యాక్టీరియా ఉండొచ్చు. కానీ, దానికన్నా 32 రెట్లు ఎక్కువగా ఖమ్మం జిల్లాలోని కృష్ణా నీళ్లలో కోలిఫాం బ్యాక్టీరియా వచ్చి చేరింది. 16 వేల ఎంపీఎన్​ వరకు కోలిఫాం బ్యాక్టీరియా అక్కడి నది నీళ్లలో కలిసిపోయింది. ఇక, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 9200 ఎంపీఎన్​ మేర కోలిఫాం బ్యాక్టీరియా తీవ్రత ఉంది. నదీ తీరాల్లో బహిరంగ మలవిసర్జన వల్ల కూడా  నీళ్లలోకి కొలిఫాం బ్యాక్టీరియా చేరుతున్నట్టు సీడబ్ల్యూసీ రిపోర్ట్​ హెచ్చరించింది. సాధారణ స్థాయిల కన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఫీకల్​ కోలిఫాం ఉన్నట్టు రిపోర్ట్​ తేల్చింది. అంటే దాదాపు 2500 ఎంపీఎన్​కుపైగా ఫీకల్​ కోలిఫాం ఉన్నట్టు వెల్లడైంది. ఇటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ఫార్మా కంపెనీలు, సిమెంట్​ కంపెనీల వ్యర్థాలూ నది నీళ్లలోకి చేరుతుండడంతో కలుషితమవుతున్నట్టు నివేదిక హెచ్చరించింది.

గోదావరిలో పారిశ్రామిక వ్యర్థాలు.. 

ఇక గోదావరిలోకి పారిశ్రామిక వ్యర్థాలతో పాటు శుద్ధి చేయని మురుగు జలాలు  నేరుగా వదులుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలి నేషనల్​ ఎన్విరాన్మెంటల్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ (నీరి) చేసిన స్టడీని సీడబ్ల్యూసీ ఎత్తి చూపించింది. రామగుండం, మంచిర్యాల జిల్లా నుంచి శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థ జలాలను గోదావరిలోకే వదులుతున్నారని, ఫలితంగా అక్కడ కూడా  కోలిఫాం బ్యాక్టీరియా స్థాయిలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ఇక, గోదావరి నదికి అత్యంత దగ్గరగా రామగుండంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డంప్​ యార్డ్​ కూడా.. ప్రమాద తీవ్రతకు కారణమవుతున్నదని, చెత్త, చెదారం నదిలోకి చేరి నీళ్లు కలుషితమవుతున్నాయని పేర్కొంది. బాసరలోనూ నేరుగా పారిశ్రామిక వ్యర్థ జలాలను నదిలోకే వదిలేస్తున్నారని, అక్కడ కూడా స్నానం చేసే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. కాగా, నదీ తీరాల వెంట కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామికీకరణ పెరిగిపోవడం, పట్టణాలు వెలియడం, ఇండస్ట్రీస్​, మానవ వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా వదలడం వల్ల నదులు కలుషితమవుతున్నాయని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు.