అధ్యక్షురాలిగా సోనియాకే ఓటు

అధ్యక్షురాలిగా సోనియాకే ఓటు
  • కాంగ్రెస్ చీఫ్ గా సోనియా కొనసాగాలని సీడబ్ల్యూసీ తీర్మానం   
  • పార్టీ ఎన్నికలు జరిగేదాకా నడిపించాలని విజ్ఞప్తి  
  • ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై నేతల చర్చ  
  • వెంటనే  దిద్దుబాటు చర్యలు తీస్కోవాలని వినతి
  • పార్లమెంట్​ బడ్జెట్​ సెషన్​ తర్వాత మళ్లీ భేటీ: వేణుగోపాల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా సోనియా గాంధీయే కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సోనియా నాయకత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని కమిటీ సభ్యులు ప్రకటించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు దిద్దుబాటు చర్యలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో పార్టీ ఓటమికి కారణాలపై చర్చించారు. సోనియా గాంధీ పార్టీలో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో సీడబ్ల్యూసీ మీటింగ్ లో పార్టీ బాధ్యతలకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు రిజైన్ చేస్తారంటూ శనివారం ప్రచారం జరిగింది. ఆ వెంటనే అదేం లేదంటూ పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. పార్టీ ప్రకటన ప్రకారమే.. సీడబ్ల్యూసీ మీటింగ్ లో సోనియా నాయకత్వానికే సభ్యులు ఆమోదం తెలిపారు.  సుమారు 4 గంటల పాటు మీటింగ్ జరిగిన తర్వాత ఆదివారం రాత్రి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు జరిగేవరకూ పార్టీ చీఫ్​గా కొనసాగాలని సోనియాను సీడబ్ల్యూసీ కోరినట్లు చెప్పారు. 

2019 నుంచీ ఇంటెరిమ్ చీఫ్​గానే.. 
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ 2017లో బాధ్యతలు చేపట్టారు. అయితే, 2019 జనరల్ ఎలక్షన్స్ లో పార్టీ ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ ఇంటెరిమ్ ప్రెసిడెంట్ గా సోనియా బాధ్యతలు చేపట్టారు. అసమ్మతి నేతల నుంచి వ్యతిరేకత రావడంతో 2020 ఆగస్టులో ఆమె రాజీనామాకు సిద్ధమయ్యారు. కానీ పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగాలని ఆమెను సీడబ్ల్యూసీ కోరింది. మరోసారి పార్టీ ఎన్నికలు జరిగేవరకూ ప్రెసిడెంట్‌‌‌‌గా కొనసాగాలని తీర్మానం చేసింది. 

బడ్జెట్ సెషన్ తర్వాత మేధోమథనం
మీటింగ్‌‌‌‌లో నేతలు చెప్పిన విషయాలను సోనియా విన్నారని, పార్టీ బలోపేతానికి అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని వేణుగోపాల్ వెల్లడించారు. బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సీడబ్ల్యూసీ మరోసారి భేటీ అవుతుందని, ఆ తర్వాత పార్టీ మేధోమథనం (చింతన్ శివిర్) జరుగుతుందని తెలిపారు. చింతన్ శివిర్ ను తమ స్టేట్ లో నిర్వహించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు.   

పార్టీ పగ్గాలు రాహుల్ కే ఇవ్వాలి: అశోక్ గెహ్లాట్  
పార్టీ పగ్గాలను రాహుల్‌‌‌‌కే అప్పగించాలని మీటింగ్ ప్రారంభానికి ముందు పలువురు నేతలు డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని రాహుల్ గాంధీ అంత ధీటుగా ఎవరూ ఎదుర్కోలేరని అశోక్ గెహ్లాట్ అన్నారు. ‘‘రాహుల్ గురించి కామెంట్స్ చేస్తూనే ప్రధాని స్పీచ్ ప్రారంభించాల్సి వస్తోంది. దీని అర్థం ఏమిటో మీరే తెలుసుకోవాలి. పార్టీ పగ్గాలను రాహుల్ అందుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం” అని ఆయన మీడియాతో చెప్పారు. సోనియా పార్టీ చీఫ్ గా కొనసాగాలన్న ప్రపోజల్ కు కర్నాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ కూడా మద్దతు తెలిపారు. పార్టీ ఫుల్ టైం బాధ్యతలను రాహుల్ గాంధీ తీసుకోవాలన్నదే తనలాంటి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల కోరికని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ నేత ఆల్కా లాంబ పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఏఐసీసీ హెడ్ ఆఫీసుకు వచ్చారు. రాహుల్, ప్రియాంకకు మద్దతుగా నినాదాలు చేశారు.

మన్మోహన్, ఏకే ఆంటోనీ గైర్హాజరు 
సీడబ్ల్యూసీ మీటింగ్ కు పార్టీ మాజీ చీఫ్ ​రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, ఆధిర్ రంజన్ చౌధరి, పి. చిదంబరం, రణదీప్ సుర్జేవాలా, తదితరులు హాజరయ్యారు. మీటింగ్‌‌‌‌కు అనారోగ్యం కారణంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కరోనా పాజిటివ్ రావడంతో రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ గైర్హాజరయ్యారు. వీరితో పాటు మరో ముగ్గురు అగ్ర నేతలు కూడా వివిధ కారణాలతో మీటింగ్‌‌‌‌కు రాలేదు. కాంగ్రెస్ లో గ్రూప్ 23 (అసమ్మతి) నేతల్లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ మాత్రమే వచ్చారు.