21 మంది సైబర్ మోసగాళ్లు అరెస్ట్.. స్పెషల్ డ్రైవ్ లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

21 మంది సైబర్ మోసగాళ్లు అరెస్ట్.. స్పెషల్ డ్రైవ్ లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 19 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్​లో 10 సైబర్ క్రైమ్​ కేసులను ఛేదించి, మొత్తం 21 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ సుదీంద్ర తెలిపారు.  అరెస్టైన 21 మందిలో 13 మంది ఆన్​లైన్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడగా.. మరో 7 మంది డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు పాల్పడ్డారు.  

ఒక కేసులో ఓ రిటైర్డ్ వృద్ధుడికి ఫోన్​చేసి వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా ఢిల్లీ పోలీసు, సైబర్ క్రైమ్  అధికారులుగా నటించారు. ఈ కేసులో మొయినుద్దీన్ ,  విపిందాస్,  రియాస్ నూరన్ మూచీ,  మహ్మద్ జకారియాను అరెస్ట్ చేశారు. 

దాడుల్లో 21 మొబైల్ ఫోన్లు, 24 సిమ్ కార్డులు, ఒక ఏటీఎం కార్డు, ఒక చెక్ బుక్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత కొన్ని రోజుల్లో 49 కేసుల్లో 163 రిఫండ్ ఆర్డర్లు పొంది, మొత్తం రూ.89,77,329 బాధితుల ఖాతాలకు  రీఫండ్​ చేసినట్టు డీసీపీ తెలిపారు.