మెసేజ్​ లింక్​ పంపి ఫోన్​ హ్యాక్..​ సైబర్ క్రిమినల్ రూ.2 లక్షలు​ టోపీ

మెసేజ్​ లింక్​ పంపి ఫోన్​ హ్యాక్..​ సైబర్ క్రిమినల్ రూ.2 లక్షలు​ టోపీ

 కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపూర్​లో ఓ వ్యక్తి నుంచి సైబర్ ​నేరగాళ్లు రూ.2 లక్షల 30 వేలు కొట్టేశారు. బాధితుడు గుండగాని శ్రీధర్ కథనం ప్రకారం..శ్రీధర్​కు ఇండియన్ ​బ్యాంక్​లో అకౌంట్​ ఉంది. ఈ నెల 26న అతడి ఫోన్​కు ఇండియన్ బ్యాంక్ స్మార్ట్ ఆప్​పేరుతో ఒక మెసేజ్​వచ్చింది. అందులో లింక్​ క్లిక్​చేసి అప్​డేట్​ చేసుకోవాలని ఉంది.

అతడికి బ్యాంకులో అకౌంట్​ఉండడంతో యాప్ డౌన్​లోడ్ ​చేసుకున్నాడు. కొంతసేపటికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ‘మీకు లోన్ ఇస్తాం. మీ ఫోన్​కు ఒక ఓటీపీ వస్తుంది. అది చెప్పండి’ అనగానే తనకు లోన్​అవసరం లేదని తిరస్కరించాడు. కానీ, అదే రోజు సాయంత్రం శ్రీధర్​ అకౌంట్ ​నుంచి రూ. 2 లక్షల 30 వేలు కట్​అయినట్టు మెసేజ్​వచ్చింది.

తనకు తెలియకుండానే తన అకౌంట్​నుంచి డబ్బులు కాజేశారని పీఎస్​తో పాటు సైబర్ క్రైమ్ నంబర్​కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. మెసేజ్​పంపించిన రోజు నుంచే తన ఫోన్ హ్యాక్ అయినట్టు తెలిసిందని చెప్పాడు.