
బషీర్బాగ్, వెలుగు: ఆన్లైన్లో ఎలక్ట్రిక్ వేప్ (హుక్కా) ఆర్డర్ చేసిన యువకుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన 21 ఏండ్ల ప్రైవేటు ఉద్యోగి ఓ వెబ్ సైట్లో రూ.3 వేల ఎలక్ట్రిక్ వేప్ (హుక్కా) ఆర్డర్ చేసి, పేమెంట్ చేశాడు. ఓ గంట తర్వాత బాధితుడి సెల్ నంబర్ కు కాల్ చేసిన స్కామర్స్.. ఆర్డర్ సిద్ధంగా ఉందని, వెంటనే డెలివరీ కావాలంటే అదనంగా రూ.2,999 డెలివరీ ఫీజు చెల్లించాలని చెప్పారు.
డెలివరీ అనంతరం డబ్బులు తిరిగి చెల్లిస్తామనడంతో నమ్మిన బాధితుడు అడిగిన డబ్బులను బదిలీ చేశాడు. అనంతరం మరో నంబర్ నుంచి స్కామర్స్ కాల్ చేసి, ఇంతకు ముందు చేసిన పేమెంట్ బ్యాంక్ అకౌంట్ లో ఫ్రీజ్ అయిందని పేర్కొన్నారు. రిఫండ్ ప్రాసెస్ పేరుతో పలుమార్లు స్కామర్స్ కు పేమెంట్ చేశాడు. బ్యాంక్ అధికారుల పేరుతో కూడా కాల్ చేసి, డబ్బులను స్కామర్స్ బదిలీ చేయించుకున్నారు.
ఎన్ని చెల్లింపులు చేసినా మరల అదే విధంగా స్కామర్స్ ఫోన్ చేస్తుండడంతో అనుమానం వచ్చిన బాధితుడు .. ఇది స్కామ్ అని గుర్తించాడు. రూ.4,26,464 లు మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.