
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాట్సాప్‌లో ఇన్వెస్ట్మెంట్స్ లింకులు పంపించి సైబర్ నేరగాళ్లు అందినంత దోచేస్తున్నారు. ఇలాంటిదే హైదరాబాద్ కేబీహెచ్‌బీకి చెందిన వ్యాపారి నాగేశ్వర్ రావు వద్ద రూ.7.88 కోట్లు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
కూకట్‌పల్లి కేపీహెచ్‌బీకి చెందిన నాగేశ్వర్‌రావు(55) వాట్సాప్‌కు జులై 25న మెసేజ్ వచ్చింది. www.finalto-indus.com పేరులో లింక్ పంపించారు. సత్యనారాయణ, వైశాలి పేరుతో ఇద్దరు పరిచయం చేసుకున్నారు. తాము ఇండియా, యూకేలో స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నట్లు చెప్పారు. తాము పంపిన లింకు ద్వారా ట్రేడింగ్ చేస్తే అతి తక్కువ సమయంలో భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు.
సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా జులై 25 వ తేదీన నాగేశ్వరరావు రూ.45 వేలు డిపాజిట్ చేశాడు. ఇందుకు గాను 15 శాతం ప్రాఫిట్ వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపారు. ఈ క్రమంలోనే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. ఇందులో భాగంగా మొదట్లో రూ.8,600 విత్ డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు.
ఇలా 65 రోజుల్లో రూ.7.88 కోట్లు నాగేశ్వర్ రావు నుంచి వసూలు చేశారు. మొత్తం రూ.11 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లు ఆన్‌లైన్ అకౌంట్‌లో చూపించారు. సెప్టెంబర్ 30న నాగేశ్వర్ రావు తన ప్రాఫిట్ అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించాడు. ఫండ్స్ విత్‌డ్రా చేసుకునేందుకు 30 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌కు గాను రూ.3 కోట్లు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీశాడు. చివరికి మోసపోయానని గుర్తించాడు. గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశాడు.