ఇది ఇండియా కాదు.. న్యూజిలాండ్.. సిక్కుల ర్యాలీని అడ్డుకున్న అతివాద గ్రూప్

ఇది ఇండియా కాదు.. న్యూజిలాండ్.. సిక్కుల ర్యాలీని అడ్డుకున్న అతివాద గ్రూప్
  • హాకా ప్రదర్శనతో నినాదాలు
  • అతివాద గ్రూప్ లీడర్ ధోరణిపై దేశవ్యాప్తంగా విమర్శలు 

ఆక్లాండ్: న్యూజిలాండ్​లోని సౌత్ ఆక్లాండ్​లో సిక్కు కమ్యూనిటీకి ఘోరం అవమానం జరిగింది. ‘నగర్  కీర్తన్’ (ర్యాలీ లాంటి ప్రదర్శన) చేసుకుంటూ వెళ్తున్న కొన్ని వందల మంది సిక్కులను అతివాద గ్రూప్  సభ్యులు అడ్డుకున్నారు. ‘‘మీకిష్టం వచ్చినట్లు ర్యాలీలు చేసుకోవడానికి ఇది ఇండియా కాదు. న్యూజిలాండ్.  ఇక్కడ మేము చెప్పినట్లు వినాలి, చేయాలి” అంటూ హాకా ప్రదర్శన చేశారు. 

గ్రేట్ సౌత్ రోడ్​లో ఈ ఘటన జరిగింది. సిక్కులను అడ్డుకున్న వారిని పెంతెకోస్తల్ పాస్టర్  బ్రయాన్  తమాకి అనుచరులుగా పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కల్పించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. 

జీసస్  ఒక్కడే దేవుడు: తమాకీ

ఈ ప్రపంచంలో ఒక్కడే దేవుడు ఉన్నాడని, ఆయనే జీసస్  అని బ్రయాన్  తమాకీ ‘ఎక్స్’ లో పేర్కొన్నాడు. జీసస్  ఒక్కడే నిజమైన దేవుడని చెప్పాడు. ‘‘న్యూజిలాండ్​కు క్లియర్  మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు నిజమైన దేశభక్తులు ముందుకు వచ్చారు. కత్తులు, కటార్లు, విదేశీ టెర్రరిస్టు జెండాలు పట్టుకున్న సిక్కులు, ఖలిస్తానీ టెర్రరిస్టులకు నేను ఒకటే చెబుతున్నా. 

ఇది మా దేశం, ఇక్కడి వీధులు మావి” అని తమాకీ ట్వీట్  చేశాడు. కాగా, తమాకీ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్తువెత్తాయి. అతడిని, అతని అనుచరుల తీరును న్యూజిలాండ్  ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్  ఖండించారు. సిక్కులకు అండగా ఉంటామని ప్రియంకతో పాటు మరికొందరు ఎంపీలు భరోసా ఇచ్చారు.