యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా.. ? అకౌంట్లు ఖాళీ అవ్వచ్చు.. బీ అలర్ట్..!

యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా.. ? అకౌంట్లు ఖాళీ అవ్వచ్చు.. బీ అలర్ట్..!
  • పెరుగుతున్న డిజిటల్ ​అరెస్టులు
  • యూపీఐ ట్రాప్స్​తో డబ్బు మాయం.. అప్రమత్తతే ఆయుధం

బిజినెస్​డెస్క్​, వెలుగు: యూపీఐ, మొబైల్ వాలెట్లు, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పేమెంట్స్​తో క్షణాల్లో పనులు జరుగుతున్నాయి. అయితే, ఫైనాన్షియల్​ టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. జాగ్రత్తగా లేకుంటే పర్సు ఖాళీ అవుతోంది. పాత వాటి గురించి అందరికీ తెలిసిపోవడంతో మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోచుకుంటున్నారు.  ప్రజల ప్రవర్తనను, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ ఇంజనీరింగ్ విధానాల ద్వారా మోసగిస్తున్నారు. ఫిషింగ్, నకిలీ మర్చంట్ యాప్​లు, సిమ్ స్వాప్ వంటి మార్గాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. 

ఆన్​లైన్ చెల్లింపులపై ఆధారపడటం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మోసాలపై అవగాహన పెంచుకోవడం అత్యవసరం. నిజానికి డిజిటల్ మోసాలు కొత్తేమీ కాదు. నకిలీ సైట్లు లేదా ప్రేమ పేరుతో వలవేసి మోసాలు చేయడం గతంలో ఉండేది. ఇప్పుడు మోసగాళ్లు కొత్తదారులను ఎంచుకుంటున్నారు.  బాధితులకు తెలియకుండానే వారి లాగిన్ లేదా కార్డు వివరాలు తీసుకుని ఖాతాల్లోకి చొరబడుతున్నారు.  ఏఐ, జనరేటివ్ టెక్నాలజీ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీలతో ఈజీగా సైబర్ నేరాలు చేస్తున్నారు. ఏఐ టూల్స్ ద్వారా క్షణాల్లో లక్షల సంఖ్యలో ఫిషింగ్ ఈ–మెయిల్స్, నకిలీ వెబ్​సైట్లు, మోసపూరిత మెసేజ్​లను సృష్టిస్తున్నారు. 

డిజిటల్ అరెస్ట్ అనేది ప్రస్తుతం జరుగుతున్న కొత్త రకం సైబర్ నేరం.  నేరగాళ్లు దర్యాప్తు అధికారులమని చెప్పుకుంటూ వీడియో కాల్స్ ద్వారా బాధితులను బెదిరిస్తారు. కేసులంటూ భయపెట్టి డబ్బులు గుంజుతారు. బాధితుడు ఏదైనా లింక్ క్లిక్ చేసినా లేదా కాల్ మాట్లాడినా,  వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. లేదా నకిలీ వెబ్ పేజీలో లాగిన్ అయ్యేలా చేసి వివరాలు దొంగిలిస్తారు. ఒక రిపోర్ట్​ ప్రకారం 2024లో దాదాపు 20 లక్షల సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో నష్టం రూ.1.2 లక్షల కోట్లు దాటవచ్చన్నది ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ అంచనా.

కొత్త రకం మోసాలు ఇవే..

యూపీఐ రీఫండ్స్​, బహుమతులు లేదా అత్యవసర పరిస్థితి అంటూ మోసగాళ్లు 'రిక్వెస్ట్ మనీ' అలర్ట్​లు పంపుతారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పొందవచ్చని నకిలీ కోడ్లు పంపుతారు. కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు జమ కావడానికి బదులు ఖాతాలోంచి కట్ అవుతాయి. క్యూఆర్ కోడ్లు కేవలం డబ్బులు పంపడానికి మాత్రమేనని, తీసుకోవడానికి కాదని చాలా మందికి తెలియదు. దీన్నే మోసగాళ్లు ఆసరాగా చేసుకుంటారు.  
    
గూగుల్ పే, ఫోన్​పే వంటి పాపులర్​ ప్లాట్​ఫామ్​లను పోలిన నకిలీ యాప్​లను తయారు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా అనధికారిక యాప్ స్టోర్లలో లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో కనిపిస్తాయి. వీటి ద్వారా సున్నిత సమాచారాన్ని దొంగిలిస్తారు.   గూగుల్​ప్లే, యాపిల్​యాప్​స్టోర్​వంటి నమ్మకమైన స్టోర్ల నుంచే యాప్​లు డౌన్​లోడ్ చేసుకోవాలి. 
    
ఎస్ఎంఎస్, ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు లేదా పేమెంట్ సంస్థల నుంచి వచ్చినట్లుగా నమ్మించే మెసేజ్​లు పంపుతారు. ఇందులోని లింక్​ను క్లిక్ చేయగానే నకిలీ లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వివరాలు ఇవ్వగానే సమాచారం చోరీ అవుతుంది. వినియోగదారులను మభ్యపెట్టి కార్డు వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్​లు నమోదు చేసేలా మోసగాళ్లు నకిలీ పేమెంట్ పేజీలను సృష్టిస్తారు. ఆ వివరాలతో అనధికారికంగా కొనుగోళ్లు చేస్తారు. 
    
మర్చంట్ ఆన్​బోర్డింగ్ మోసాలూ పెరిగాయి. ఈ విధానంలో స్కామర్లు తాము నిజమైన వ్యాపారులమని నమ్మించి నకిలీ పత్రాలతో పేమెంట్ గేట్​వేలలో చేరతారు. దొంగిలించిన క్రెడిట్​కార్డులతో మోసపూరిత లావాదేవీలు లేదా మనీ లాండరింగ్ చేస్తారు. ఇతరుల గుర్తింపును వాడుకుని వ్యాపారాలు సృష్టించడం, ఖాతాలు తెరిచి మోసపూరిత కొనుగోళ్లు చేసి మాయమవడం వంటివి ఇందులో ఉంటాయి. 
    
డిజిటల్ అరెస్ట్ మోసాలు ఇప్పుడు నయా ట్రెండ్. ఈ విధానంలో బాధితులకు వీడియో కాల్స్ వస్తాయి. అవతలి వ్యక్తులు పోలీసు అధికారులమని చెప్పుకుంటారు. మనీ లాండరింగ్, డ్రగ్స్ రవాణా లేదా పన్ను ఎగవేత వంటి నేరాల్లో మీపై కేసు నమోదైందని భయపెడతారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు పంపాలని ఒత్తిడి చేస్తారు. కొంతమంది ఐటీ ఎక్స్​పర్టులు కూడా డిజిటల్​అరెస్టు బారినపడ్డారంటే మోసగాళ్లు ఎంతలా ఆరితేరారో అర్థం చేసుకోవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి...

డిజిటల్ పేమెంట్స్ కాలంలో సురక్షితంగా ఉండాలంటే మోసగాళ్లు మన బలహీనతలను ఎలా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి లేదా అధికారులమని చెప్పి భయపెట్టి మోసం చేస్తారు.  వీటి నుంచి రక్షించుకోవడానికి అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. అనుమానాస్పద కాల్, మెసేజ్ లేదా వీడియో చాట్ వస్తే వెంటనే కట్ చేయాలి. బ్యాంకును సంప్రదించాలి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్​లో ఫిర్యాదు చేయాలి. 

టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోవడం, అనుమానిత లింకులపై క్లిక్ చేయకపోవడం, బ్యాంక్ స్టేట్​మెంట్లను తరచుగా గమనించడం, క్లిష్టమైన పాస్​వర్డ్​లు పెట్టుకోవడం ద్వారా డిజిటల్ భద్రతను పెంచుకోవాలి. చాలా పేమెంట్ సెక్యూరిటీ సంస్థలు ఇప్పుడు ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలను వాడుతున్నాయి. అధికారిక బ్యాంక్ వెబ్​సైట్లు, మర్చంట్ వెబ్​సైట్లు, వెరిఫైడ్ కస్టమర్ కేర్ నంబర్లు, ఈ–మెయిల్స్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.