పెళ్లి పేరుతో యువతి హనీ ట్రాప్

పెళ్లి పేరుతో యువతి హనీ ట్రాప్

హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా యువకులను ట్రాప్ చేస్తోందన్న ఆరోపణలతో ఓ యువతిని, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో అందమైన ఫొటోలు, వీడియోలు పెట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఫిర్యాదు అందుకున్న  సైబర్ క్రైమ్ పోలీసులు హనీ ట్రాప్ కు పాల్పడుతున్న యువతి తనుశ్రీ.. ఆమె ప్రియుడు శ్రీకాంత్ లను అరెస్టు చేశారు. 

కృష్ణాజిల్లా మచిలీపట్టణంకు చెందిన తనుశ్రీ, ఆమె ప్రియుడు శ్రీకాంత్ సినీ ఫక్కీలో అమాయకులైన యువకులను ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. తను శ్రీ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈమె వీడియోలు చూసి లైకులు కొట్టిన వారిని కవ్వించి, రెచ్చగొట్టి వీలు చూసుకుని ప్రేమ అంటూ.. ఆ తర్వాత పెళ్లి పేరుతో ట్రాప్ చేస్తున్నారు. చాలా మంది దగ్గర ఏదో ఒక పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. 

ఇదే కోవలో హైదరాబాద్కు చెందిన యువకుడిని ట్రాప్ చేసి తల్లికి అనారోగ్యం ఉందంటూ 8 నెలల కాలంలో దాదాపు 31 లక్షల రూపాయలు వసూలు చేశారు. తరచూ అబద్దాలు చెబుతుండడంతో నిలదీసి ప్రశ్నించగా మొహం చాటేసింది. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు తనుశ్రీ సోషల్ మీడియా అకౌంట్లపై విచారణ చేపట్టారు. చాలా తెలివిగా.. ప్రేమ, పెళ్లి పేరుతో చాలా మంది అమాయకులైన యువకులను ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు.  

అందంగా లేనా.. అసలేం బాలేనా అంటూ సినిమా హీరోయిన్ల మాదిరిగా ఓ యువతి అమాయకులను టార్గెట్ చేసి భారీ మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు దొరికాయి. సోషల్ మీడియాలో ఇన్ స్టా, ఫేస్ బుక్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన తనుశ్రీ తన వీడియోలకు ఎవరైనా అబ్బాయిలు లైక్ కొడితే చాలు తన ప్రియుడి సహాయంతో.. లైకులు కొట్టిన వారి నుంచి సర్వం దోచుకోవడం ప్రారంభించినట్లు తేలింది. 

ఈ కీలాడీ లవర్స్ మోసాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసాల బాట పట్టినట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. దీంతో తనుశ్రీని, ఆమెకు సహకరిస్తున్న శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి మొత్తం ఎంత మందిని ఎలా దోచుకున్నారన్నది రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు.