- అనధికారిక రిమోట్ యాక్సెస్‌తో డేంజర్
- సైబర్ సేఫ్టీ లేని సీసీటీవీలతో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు హ్యాక్
- అడ్మిన్/అడ్మిన్" పాస్‌వర్డ్ తో అటాక్ చేస్తున్న హ్యాకర్లు
- ఇండియన్ స్టాండర్డ్స్ కెమెరాలనే కొనాలి : సైబర్ క్రైమ్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఇండ్లు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటున్న సీసీటీవీ కెమెరాలు వ్యక్తిగత గోప్యతకు ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా విదేశీ టెక్నాలజీతో రూపొందించిన కెమెరాల ద్వారా హ్యాకర్లు మన బెడ్‌రూమ్‌ల వరకు తొంగిచూసే ప్రమాదం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించాయి. మార్కెట్‌లో జపాన్, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న తక్కువ ధర సీసీ కెమెరాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు.
ఈ కెమెరాల్లో వాడే సాఫ్ట్వేర్ ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తారు. వినియోగదారులు ఈ కెమెరాలను కొనుగోలు చేసి, వాటికి సంబంధించిన విదేశీ యాప్స్‌ను మొబైల్స్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు, మన వ్యక్తిగత డేటా విదేశీ సర్వర్ల చేతుల్లోకి వెళ్తోంది. ఇలా , సీసీటీవీ కెమెరాల సెక్యూరిటీ సిస్టమ్‌లో అనధికారిక రిమోట్ యాక్సెస్ ప్రమాదకరంగా మారింది.
హ్యాకింగ్ ఎలా జరుగుతుందంటే..
విదేశీ సర్వర్లతో అనుసంధానమైన సీసీ కెమెరాల్లో భద్రతా ప్రమాణాలు అత్యంత బలహీనంగా ఉంటున్నాయి. హ్యాకర్లు భద్రత లేని ప్రోటోకాల్‌లు, ఎన్‌క్రిప్ట్ చేయని వెబ్‌సైట్ల ద్వారా వీడియో ఫీడ్‌ను రిమోట్‌గా స్వాధీనం చేసుకుంటున్నారు. చాలా కెమెరాలు ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌లో ఉండే "అడ్మిన్/అడ్మిన్" వంటి అత్యంత బలహీనమైన పాస్‌వర్డ్‌లతోనే వస్తున్నాయి. వీటిని బ్రూట్-ఫోర్స్ దాడుల ద్వారా హ్యాకర్లు సులభంగా ఛేదిస్తున్నారు. పాతబడిన ఆపరేటింగ్ సిస్టమ్‌లు, ప్యాచ్ చేయని ఫర్మ్‌వేర్ వల్ల సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడే 'బగ్‌లు' మాల్‌వేర్ దాడులకు తలుపులు తీస్తున్నాయి. భారత్‌లో వినియోగిస్తున్న మెజారిటీ కెమెరాల డేటా దేశం వెలుపల ఉన్న కంప్యూటర్ల(సర్వర్లలో) ద్వారా పంపబడుతోంది. అంటే, ఇంట్లోనో లేదా ఆఫీసులోనో రికార్డ్ అవుతున్న దృశ్యాలు నేరుగా వేరే దేశంలోని సర్వర్లలో నిక్షిప్తమవుతున్నాయి.
మొబైల్‌లో సీసీటీవీ ఫుటేజ్ చూడాలనుకున్నప్పుడు, ఆ సిగ్నల్ కెమెరా నుంచి నేరుగా మన ఫోన్‌కు రాదు. అది ముందుగా కెమెరాను తయారు చేసిన కంపెనీకి చెందిన క్లౌడ్ సర్వర్‌కు (చైనా, జపాన్, అమెరికాలోని సర్వర్లకు) వెళ్లి, అక్కడి నుంచి తిరిగి మన ఫోన్‌కు వస్తుంది. మన డేటా సరిహద్దులు దాటి వెళ్లినప్పుడు దానిపై భారత ప్రభుత్వానికి, మన చట్టాలకు నియంత్రణ ఉండదు. డేటా అంత దూరం ప్రయాణించే క్రమంలో ఎక్కడైనా భద్రతా లోపాలు ఉంటే హ్యాకర్లు దొంగిలించడం సులభం అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, సైబర్ బ్యూరో అధికారులు"మేడ్ ఇన్ ఇండియా" కెమెరాలను వాడమంటున్నారు. మన దేశంలోనే సర్వర్లు ఉన్న కంపెనీలను ఎంచుకుంటే మన డేటా సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.
క్వాలిటీ సర్టిఫికేషన్ కెమెరాలను కొనాలి
“ సీసీటీవీ వ్యవస్థలు చిప్‌సెట్‌ల వంటి కీలక వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అనధికార రిమోట్ యాక్సెస్‌ను నివారించడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌లను అందించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేని నమూనాలను కొనుగోలు చేయరాదు. రిమోట్ యాక్సెస్ కంట్రోల్ ద్వారా వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేసే అవకాశాలు ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్‌ఐ) వద్ద నమోదు చేయబడిన, స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్‌తో ఉన్న కెమెరాలను కొనుగోలు చేయాలి.’’ - శివమారుతి, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్
