- రూ. 18 లక్షలు డిపాజిట్ చేయాలని రిటైర్డ్ టీచర్‌కు బెదిరింపులు
నల్గొండ, వెలుగు : సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ టీచర్‌కు ఫోన్ చేసి డ్రగ్స్ కేసు నమోదు అయిందని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి రూ. 18 లక్షలు డిమాండ్ చేశారు. బ్యాంక్‌కు వెళ్లి ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే క్రమంలో బ్యాంక్ మేనేజర్ గుర్తించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబర్ కుట్ర భగ్నమైంది.
ఈ ఘటన నల్గొండ పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ పుచ్చకాయల దేవేందర్‌రెడ్డికి బుధవారం సాయంత్రం కొందరు వ్యక్తులు వీడియో కాల్ చేశారు. ‘మీ పేరు పైన ఉన్న సిమ్‌తో బెంగళూరులో డ్రగ్స్ దందా జరిగింది, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం’ అంటూ బెదిరించారు. బుధవారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఉన్నారు.
కేసు నుంచి బయటపడాలన్నా, అరెస్ట్ కాకుండా ఉండాలన్నా తాము చెప్పిన అకౌంట్ నంబర్‌కు రూ. 18 లక్షలు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో దేవేందర్‌రెడ్డి శుక్రవారం ప్రకాశం బజార్‌లోని ఎస్‌బీఐకి వెళ్లి ఆర్టీజీఎస్ ద్వారా రూ. 18 లక్షలు డిపాజిట్ చేసేందుకు ఓచర్ ఫిల్ చేశాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన బ్యాంక్ సిబ్బంది మేనేజర్ మైథిలి వద్దకు పంపించగా.. ఆమె వివరాలు అడుగగా దేవేందర్‌రెడ్డి భయపడుతున్నట్లు కనిపించాడు. దీంతో మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్సై విష్ణుకుమార్ బ్యాంక్ వద్దకు చేరుకొని బాధితుడిని విచారించగా.. జరిగిన విషయం మొత్తాన్ని వివరించారు. దీంతో అతడికి వచ్చిన నంబర్‌కు తిరిగి కాల్ చేయగా.. వారు తడబడుతూ సమాధానాలు చెప్పడంతో పాటు వెంటనే స్విచ్‌ఆఫ్ చేశారు. దీంతో భారీ ముప్పు తప్పింది. సకాలంలో స్పందించి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన సైబర్ క్రైమ్ పోలీసులను ఎస్పీ అభినందించారు.
రైతు అకౌంట్ నుంచి రూ. లక్ష మాయం
గద్వాల టౌన్, వెలుగు : ఓ రైతు అకౌంట్ నుంచి తన ప్రమేయం లేకుండానే రూ. లక్ష మాయం అయ్యాయి. ఈ ఘటన గద్వాల జిల్లా ధరూర్ మండలంలో వెలుగుచూసింది. మండలంలోని రేవులపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణ వడ్లు అమ్మగా వచ్చిన డబ్బులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ అయ్యాయి.
కొద్దిసేపటి తర్వాత అతడి అకౌంట్ నుంచి రూ. 50 వేల చొప్పున రెండు సార్లు మొత్తం రూ. లక్ష కట్ అయ్యాయి. డబ్బులు కట్ అయిన మెసేజ్ చూసుతున్న రైతు బ్యాంక్‌కు వెళ్లి విచారించడంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు అకౌంట్ నుంచి కట్ అయిన డబ్బులు మరో అకౌంట్‌లో పడి.. ముంబైలో విత్ డ్రా అయినట్లు గుర్తించారు.
