తక్కువ ధరకే డ్రెస్సులంటూ మహిళను నమ్మించి.. లక్షా 13 వేలు కొట్టేసిన కేటుగాళ్లు

తక్కువ ధరకే డ్రెస్సులంటూ మహిళను నమ్మించి.. లక్షా 13 వేలు కొట్టేసిన  కేటుగాళ్లు

కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకత్వమే ఆసరాగా.. ఆన్లైన్ ఆశలను ఎరగా వేసి ఇద్దరు మహిళల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేశారు. కేవలం మాటల గారడీతో సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా దోచుకున్నారు.

జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్‌లో గార్మెంట్ వ్యాపారం చేస్తున్న ఓ మహిళ.. ఆన్లైన్లో తక్కువ ధరకే డ్రెస్సులు వస్తాయన్న ప్రకటన చూసి మోసపోయారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి సంప్రదించగా.. కేటుగాళ్లు నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన మహిళ.. వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చి  ఏకంగా ఒక లక్షా 13 వేల రూపాయలను ఫోన్ పే ద్వారా పంపారు. నగదు అందిన వెంటనే అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

మరో ఘటనలో  అశోక్ నగర్ కాలనీకి చెందిన మరో మహిళ సైతం ఇన్‌స్టాగ్రామ్ మాయలో పడ్డారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్రాంచైజీ పేరుతో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి.. ఏకంగా రూ .90 వేలు అకౌంట్ పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. డబ్బులు చేరగానే  కేటుగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 

వరుసగా జరుగుతున్న ఈ మోసాల నేపథ్యంలో జిల్లా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ ప్రకటనలు, గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి అపరిచితులకు నగదు పంపవద్దని.. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.