వర్క్ ఫ్రమ్ హోం పేరుతో నయా మోసం..6 నెలల్లోనే రూ. 171 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

వర్క్ ఫ్రమ్ హోం పేరుతో  నయా మోసం..6 నెలల్లోనే రూ. 171 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

 

  • రేటింగ్, టాస్క్​లు అంటూ సైబర్ కేటుగాళ్ల దోపిడీ
  • ఇన్వెస్ట్​మెంట్ పేరుతో వాట్సప్​లో మెసేజ్​లు
  • ఒక్కో టాస్క్​కు రూ.200 ఇస్తామంటూ ట్రాప్​
  • రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లోనే 8,866 మంది బాధితులు
  • రూ.171 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
  • హఫీజ్ పేట యువతి నుంచి రూ.9 లక్షలు లూటీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఇంటి వద్దే ఉంటూ ఆన్‌‌లైన్‌‌లో రేటింగ్స్, టాస్క్‌‌లు కంప్లీట్ చేస్తే దండిగా డబ్బులు వస్తాయంటూ సైబర్ కేటుగాళ్లు నమ్మించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇన్వెస్ట్​మెంట్లు, పార్ట్ టైమ్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోం పేరుతో అకౌంట్లు కొల్లగొడ్తున్నారు. రేటింగ్ కోసం బ్రాండెడ్ కంపెనీల లింకులు క్లిక్ చేయడం, స్క్రీన్ షాట్స్ తీయడం, రేటింగ్స్ ఇవ్వడం వంటి టాస్క్​లు ఇస్తున్నారు. ఒక్కో టాస్క్​కు రూ.200 నుంచి రూ.500 వరకు ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. ఇలా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కిన వారికి ముందు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ట్రాప్ చేస్తున్నారు. 

తర్వాత భారీ మొత్తంలో డిపాజిట్లు చేయించుకుంటున్నారు. రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు మొదలుకొని లక్షల్లో కొల్లగొడ్తున్నారు. ఇలా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లోనే 8,866 మంది నుంచి రూ.171 కోట్లు దోచుకున్నారు. హైదరాబాద్ హఫీజ్​పేట్​లో నివాసం ఉండే ఓ యువతి నుంచి రూ.9 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె అందించిన వివరాల ఆధారంగా రూ.2లక్షల వరకు ఫ్రీజ్ చేశారు.

“ర్యాంకింగ్ బై ఎస్‌‌ఈవో” కంపెనీగా పరిచయం

హఫీజ్‌‌పేటకు చెందిన యువతి వాట్సాప్‌‌కి ఈ నెల 5వ తేదీన 870751 9892 నంబర్ నుంచి మెసేజ్‌‌ వచ్చింది. “ర్యాంకింగ్ బై ఎస్‌‌ఈవో”లో హెచ్‌‌ఆర్‌‌‌‌ అసిస్టెంట్‌‌ శివానిగా ఓ మహిళ పరిచయం చేసుకున్నది. ర్యాంకింగ్ బై ఎస్‌‌ఈవో కంపెనీ సోషల్ మీడియాలో తమ బ్రాండ్‌‌లను ప్రమోట్ చేస్తున్నదని, తాము పంపే లింకులను క్లిక్ చేయడం, స్క్రీన్‌‌షాట్‌‌లు తీసుకోవడం ద్వారా ఒక్కో క్లిక్‌‌కు రూ.200 చెల్లిస్తామని నమ్మించింది. ఈ క్రమంలో టెలిగ్రామ్ @ CalmePurna పేరుతో ఉన్న యూజర్‌‌‌‌ ఐడీ కనెక్ట్ చేశారు. పూర్ణ అనే ఆమె రిసెప్షనిస్ట్‌‌గా పరిచయం చేసుకున్నది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 288 మంది సభ్యులతో “B-AjioMall Tasks  453” అనే టెలిగ్రామ్ గ్రూప్‌‌లో చేర్చారు. ఆ తర్వాత యువతి రూ.2,000 ఇన్వెస్ట్‌‌ చేసింది. ఇందుకుగాను రూ.6,850 సంపాదించినట్లు ఆన్‌‌లైన్‌‌ వర్చువల్‌‌ అకౌంట్‌‌లో బ్యాలెన్స్‌‌ చూపించారు. ఆ తరువాత Oasis (oasiss.cc/j5) అనే ట్రేడింగ్ సైట్‌‌లో చేరాలని యూజర్, పాస్‌‌వర్డ్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌‌ చేసుకోవాలని బలవంతం చేశారు.

‘హైయర్ ట్రేడింగ్’ సైట్‌‌లో చేరేలా ఒత్తిడి

ఆగస్టు 9న హితేశ్ పర్మార్ అనే పేరుతో ‘హైయర్ ట్రేడింగ్’ సైట్‌‌లో చేరేలా ఒత్తిడి చేశారు. కొన్ని టాస్క్​లు ఇచ్చారు. వాటిలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పారు. వాటిని రద్దు చేసేందుకు రూ.1.2 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించారు. లేదంటే పెట్టుబడిగా పెట్టిన డబ్బు మొత్తం కోల్పోతారని భయపెట్టారు. దీంతో బాధితురాలు తన ఐసీఐసీఐ అకౌంట్‌‌ ద్వారా రూ.1.2 లక్షలు ట్రాన్స్‌‌ఫర్ చేసింది. మళ్లీ తప్పులు చేశారని ‘క్రెడిట్ పాయింట్లను’ రీస్టోర్ చేయడానికి పెద్ద మొత్తాలను డిపాజిట్ చేయాలని బలవంతం చేశారు. నమ్మించేందుకు పలు ఫ్యాబ్రికేటెడ్‌‌ బ్యాంక్‌‌ అకౌంట్లు, బాధితురాలి పేరుతో పేమెంట్‌‌ రిసిప్ట్​లు పంపించారు. మొత్తం డబ్బు అకౌంట్‌‌లో డిపాజిట్‌‌ అవుతుందని నమ్మించారు. తాము చెప్పినట్లు డబ్బు డిపాజిట్‌‌ చేయకపోతే పెట్టుబడి పెట్టిన డబ్బును కోల్పోతారని భయపెట్టారు. బాధితురాలిని నమ్మించేందుకు అదే గ్రూపులో సభ్యులుగా ఉన్న సైబర్‌‌‌‌ నేరగాళ్లు తమకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్లు పోస్టింగ్స్‌‌ చేశారు. ఇలా ఆగస్టు 10న 2 విడతలుగా రూ.5 లక్షలు బాధితురాలు డిపాజిట్‌‌ చేసింది.

అప్పు తెచ్చి మరీ డబ్బులు ట్రాన్స్​ఫర్

అప్పు తెచ్చి మరీ విడతల వారీగా మొత్తం రూ.9,06,800 బాధితురాలు ట్రాన్స్​ఫర్ చేసింది. ఇలా టాస్క్‌‌లు, ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని రూ.10,30,140 లక్షలుగా సైబర్ నేరగాళ్లు ఆన్‌‌లైన్‌‌లో అకౌంట్లలో చూపారు. ఈ మొత్తాన్ని విత్‌‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.3 లక్షలు డిపాజిట్‌‌ చేయాలని సూచించారు. అకౌంట్‌‌లో బ్యాలెన్స్ కనిపించినప్పటికీ విత్‌‌ డ్రా చేసుకునే చాన్స్ లేకపోవడం, మళ్లీ డబ్బులు డిపాజిట్‌‌ చేయాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చివరకు తాను మోసపోయానని గ్రహించింది. ఈ మొత్తం వ్యవహారంలో బాధితురాలు డిపాజిట్‌‌ చేసిన డబ్బులో కేవలం రూ.7,050 మాత్రమే తిరిగి వచ్చాయి. మిగితా రూ.8,99,750 సైబర్ నేరగాళ్ల కొట్టేశారు. దీనిపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్‌‌ పోర్టల్‌‌లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 12న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సైబర్‌‌‌‌ క్రైమ్‌‌ రిపోర్టింగ్‌‌ పోర్టల్‌‌లో కంప్లైంట్‌‌ చేసినందున దాదాపు రూ.2లక్షల వరకు ఫ్రీజ్‌‌ అయ్యాయి. ఈ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత బ్యాంక్ అకౌంట్ల నుంచి బాధితురాలి అకౌంట్‌‌కి రిఫండ్‌‌ అవుతాయి.