- మోసగాళ్ల ఐపీ అడ్రస్, కాల్ రూటింగ్ డేటా సేకరణ
- నేరగాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు
- జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఏపీకే ఫైల్స్‌తో ఫోన్లను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేస్తుండడంతో సైబర్ సెక్యూరిటీ రంగంలోకి దిగింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేయడంతో సైబర్ అధికారులు అప్రమత్తమయ్యారు. సిటీ సైబర్ క్రైం పోలీసులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా సమాచారం సేకరిస్తున్నారు. సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. మోసగాళ్ల ఐపీ అడ్రస్, కాల్ రూటింగ్ వివరాలు, ఏపీకే ఫైల్స్‌ను విశ్లేషిస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్లు, నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ ప్లాట్‌ఫాంతో సమన్వయం చేసుకుంటూ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్‌ను గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాట్లు చేయనున్నామని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ఏపీకే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్‌లు సహా ప్రస్తుతం ఎక్కువగా నమోదవుతున్న ఇన్వెస్ట్‌మెంట్ మోసాలకు సంబంధించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులను నేరగాళ్లు హ్యాక్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. డిజిటల్ అరెస్టు లేదా ఇతర మోసాలకు గురైతే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన వాట్సాప్ నంబర్ 87126 72222 కు లేదా1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
