
హైదరాబాద్, వెలుగు: బిగ్‌బాస్కెట్ ‘ఫేక్’ యాప్‌తో సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి(36) నుంచి రూ.1.97 లక్షలు కాజేశారు. ఈ ఘటన వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ శివమారుతి మీడియాకు తెలియజేశారు. యూసఫ్ గూడకు చెందిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు బిగ్‌బాస్కెట్ పేరుతో ఉన్న ఫేక్ యాప్ లింక్ పంపించారు.
తక్కువ ధరలకు వస్తువులను అందిస్తామని ప్రలోభ పెట్టి ఆకర్షించారు. ఇది నిజమని నమ్మిన బాధిత వ్యక్తి..లింక్ ఓపెన్ చేసి , వెబ్ సైట్ లో పలు వస్తువులను ఆర్డర్ చేశాడు. అనంతరం స్కామర్.. బిగ్ బాస్కెట్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని, ఆర్డర్ చేసిన వస్తువులకు బిల్ క్లియర్ చేయాలని సూచించాడు. బాధితుడి వాట్సాప్ కు ఓ ఏపీకే ఫైల్ ను పంపించారు.
బాధితుడు ఫైల్ ఇన్స్టాల్ చేసి, తన క్రెడిట్ కార్డు నుంచి రూ.360 లను చెల్లించాడు. కానీ, కొన్ని నిమిషాల్లోనే అతని ఫోన్‌కు "మీ క్రెడిట్ కార్డ్ నుంచి రూ.1,97,497 అన్ఆథరైజ్డ్ డెబిట్ అయింది"అని మెసేజ్ రావడంతో షాక్ అయిన బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఐపీ అడ్రస్‌లు, కాలింగ్ రికార్డులు సేకరిస్తున్నారు.