
సూటు బూటు వేసి.. ఖద్దరు బట్టలు తొడిగి.. మంచి కార్లు.. చేతికి గోల్డు రింగులు పెట్టి కాస్త మెయింటైన్ చేస్తే చాలు. సొసైటీలో అలాంటి వాళ్లకు మస్త్ రెస్పెక్ట్. అలాంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేందుకు ఎవ్వరూ వెనకాడరు. పొలిటికల్ సపోర్టు కూడా ఉంది. మన డబ్బు ఎటుపోతుందిలే అని అప్పులు ఇస్తుంటారు. అలా పెరిగిన బిల్డప్ ఆధారంగా అప్పు చేసి మరీ జల్సాలకు దిగుతుంటారు కొందరు. అలాంటి వ్యక్తికి సంబంధించిన స్టోరే ఇది. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవటంతో వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయడం గ్రామస్తులను ఏకం చేసింది. ఏకంగా ఇల్లు కాలబెట్టే వరకు వెళ్లింది ఆగ్రహం.
ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. యువకుడిని నమ్మి అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి మోసపోయిన వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆస్పత్రికి తరలించగా పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో గ్రామస్తులంతా యువకుడి ఇంటిని ముట్టడించి తగలబెట్టేశారు.
పీఏపల్లి మండలం వద్దిపట్ల పలుగుతండ గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ అనే యువకుడికి కోటి కి పైగా డబ్బులు ఇచ్చి మోసపోయాడు ఓ వ్యక్తి. గత 15 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, తండావాసులు బాలాజీ ఇంటిని ముట్టడించి సామాన్లు ధ్వంసం చేసి, ఫర్నిచర్ ను తగలబెట్టారు. బాలాజీ నాయక్ కు అప్పులు ఇచ్చిన బాధితులు అనేక మంది ఉన్నట్లు చెబుతున్నారు. కోట్ల రూపాయలతో జల్సాలకు అలవాటు పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. బాలాజీ నాయక్ కు అండగా ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీసులు ఉన్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే అరెస్టు చేసి తమ డబ్బులు ఇప్పించాలని.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.