
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లో డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి రిటర్నింగ్ అధికారులతో రివ్యూ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా చేపట్టాలన్నారు.
మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు 2 విడతల్లో జరుగుతాయని, జిల్లాలో 16 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 9న ఉదయం 10-.30 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సాంకేతిక వృత్తి విద్యను సద్వినియోగం చేసుకోవాలి
జన్నారం రూరల్, వెలుగు: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అధునాతన సాంకేతిక వృత్తి విద్యను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం జన్నారం మండలం కిస్టాపుర్ లోని అడ్వాన్స్డ్టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ఏటీసీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక వృత్తి విద్య కోర్సులను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలన్నారు. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఈ కేంద్రాల్లో వృత్తి విద్య కోర్సులు అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని కేజీబీవీని సందర్శించి ఇంటర్ కొరకు అదనంగా కడుతున్న గదుల పనులను పరిశీలించి స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతోందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.