తుమ్మిడిహెట్టికి 2 అలైన్ మెంట్లను పరిశీలిస్తున్నం..అక్టోబర్ 22 నాటికి ఏదో ఒకటి ఫైనల్ చేస్తం: మంత్రి ఉత్తమ్

తుమ్మిడిహెట్టికి 2 అలైన్ మెంట్లను పరిశీలిస్తున్నం..అక్టోబర్ 22 నాటికి ఏదో ఒకటి ఫైనల్ చేస్తం: మంత్రి ఉత్తమ్
  • మైలారం నుంచి సుందిళ్లకు నీటి తరలింపునకు ఒకటి
  • మైలారం తర్వాత లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు మరో ప్లాన్ 
  • రెండింటిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం 
  •  సెక్రటేరియెట్​లో అధికారులతో మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు:  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టితీరుతామని, అదే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులో రెండు ప్రత్యామ్నాయ కాల్వల అలైన్​మెంట్లపై ఇంజనీరింగ్ అధికారులు విశ్లేషిస్తున్నారని చెప్పారు. మొదటి అలైన్​మెంట్ ప్రకారం, తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 14 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా సుందిళ్లకు నీటిని తరలించడాన్ని.. రెండో అలైన్​మెంట్​ప్రకారం, ఓ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించడాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. 

ఈ రెండు అలైన్​మెంట్లలో ఒక దానిని ఈ నెల 22 నాటికి డిసైడ్ చేస్తామన్నారు. ఖర్చు, నీటి తరలింపు, విద్యుత్ అవసరాలు, అనువైన భూమి పరిస్థితుల వంటివాటిని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ఉంటుందన్నారు. మంగళవారం సెక్రటేరియెట్​లో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. 

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు రెండు అలైన్​మెంట్ల ఆప్షన్లపై సమగ్రమైన విశ్లేషణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం సర్కారు ప్రాధాన్య జాబితాలో ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు, ఎస్ఎల్​బీసీ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్ల వంటి పనులు ఉన్నాయని తెలిపారు. 

ఎన్​డీఎస్ఏ రిపోర్టు ప్రకారమే రిపేర్లు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్​డీఎస్ఏ) రిపోర్టు ఆధారంగానే చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) నేతృత్వంలో బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్(ఈవోఐ)ను ఆహ్వానించిందన్నారు. 

ఓ ప్రఖ్యాత ఐఐటీ కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుందని చెప్పారు. నిర్మాణ డిజైన్లు, టెస్టింగ్​తో పాటు పునరుద్ధరణ ప్రణాళికలను ఐఐటీ చూసుకుంటుందన్నారు. కాగా, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ వాదనలు పూర్తయ్యాయని, త్వరలోనే ఏపీ వాదనలు మొదలవుతాయని చెప్పారు.

 సమ్మక్క సాగర్ కు నీటి కేటాయింపులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సుల కోసం సీడబ్ల్యూసీకి అప్లికేషన్ ఇచ్చామని ఉత్తమ్ తెలిపారు. సీతమ్మ సాగర్, మోడికుంట వాగు, చనాక కొరాట బ్యారేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన కింద దరఖాస్తులు చేశామన్నారు. ప్రాజెక్టుల్లో పూడికతీతకు సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీపైనా 
మంత్రి రివ్యూ చేశారు.     

రెండేండ్లలో ఎస్ఎల్​బీసీ పూర్తి

ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి కచ్చితంగా పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు పనులపై రివ్యూలు చేస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. వర్షాకాలం పూర్తవ్వగానే పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. హెలికాప్టర్ సర్వేల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి త్వరలోనే అనుమతులు తీసుకుంటామని చెప్పారు. 

నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్ జీఆర్ఐ) నేతృత్వంలో సర్వే చేయిస్తామని, భూమి లోపలి రాతి నిర్మాణాలు, గైడ్ అలైన్​మెంట్ కరెక్షన్స్ వంటి వివరాలను మ్యాప్ చేస్తామన్నారు. డిండి ప్రాజెక్ట్​ పనుల పురోగతిపై మూడు రోజుల్లోగా పూర్తి స్థాయి రివ్యూ రిపోర్టును సమర్పించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలిచ్చారు