ఆ ఐపీఎస్లను వదలం..రేవంత్ మెప్పు కోసం మాపై అక్రమ కేసులు పెడ్తున్నరు: హరీశ్ రావు

ఆ ఐపీఎస్లను వదలం..రేవంత్ మెప్పు కోసం మాపై అక్రమ కేసులు పెడ్తున్నరు: హరీశ్ రావు
  •     ఏపీలో సీనియర్​ ఐపీఎస్​లకు పట్టిన గతే మీకూ పట్టిస్తం
  •     రిటైర్​ అయినా, విదేశాలకు పోయినా, సెంట్రల్​ సర్వీసుల్లో ఉన్నా లాక్కొస్తం
  •     సీఎంకు వాస్తు భయం.. అందుకే సెక్రటేరియెట్​కు రావట్లేదు
  •     పాలమూరుకు 7వేల కోట్లు ఖర్చు చేస్తే.. 7 గజాల కాల్వ తవ్వారా? అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: కొందరు ఐపీఎస్​లు పదవులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్​ మెప్పు పొందేందుకు బీఆర్ఎస్​ లీడర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. ఫార్ములా ఈ కేసులో నిర్వాహకులు, స్పాన్సర్లను వదిలేసి కేవలం కేటీఆర్​పై రాజకీయ కక్షతో కేసులు పెట్టారన్నారు.

ఇప్పుడు ఫోన్​ ట్యాపింగ్​ కేసులో తనకు సిట్​ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ‘‘అక్రమ కేసులు పెడుతున్న ఐపీఎస్​ అధికారులంతా జాగ్రత్తగా ఉండాలి. ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెడ్తే వడ్డీతో చెల్లిస్తాం’’అని ఆయన హెచ్చరించారు. 

ఏపీలో సీనియర్​ ఐపీఎస్​లకు ఏ గతి పట్టిందో.. అదే గతి పట్టిస్తామన్నారు. రిటైర్​ అయినా, విదేశాలకు పోయినా, సెంట్రల్​ సర్వీసుల్లో ఉన్నా లాక్కొచ్చి కేసులు పెడ్తామన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో చిట్​చాట్​ చేశారు. తమ దగ్గర ఖాకీ బుక్కు ఉందని డీజీపీ శివధర్​ రెడ్డి చెబుతున్నారని.. తమ బుక్కులోనూ అందరి లెక్కలు రాస్తున్నామని హరీశ్​  హెచ్చరించారు.

అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి

ఇరిగేషన్​పై అసెంబ్లీలో ప్రభుత్వం పీపీటీ పెడతామంటున్నదని.. అలాగైతే, బీఆర్ఎస్​కూ పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని హరీశ్​ రావు డిమాండ్​ చేశారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీల కన్నా తక్కువ టైం మైక్​ ఇస్తున్నారని, ఎక్కువ మంది సభ్యులున్నా బీఆర్​ఎస్​కు ఆయా పార్టీలకన్నా ఎక్కువ సమయం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు డీపీఆర్ అప్రైజల్​ ఇవ్వాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి లేఖ రాశారని హరీశ్​ గుర్తుచేశారు. బీఆర్ఎస్​ హయాంలో డీపీఆర్​ వెనక్కొస్తే అనుమతులు ఎలా వస్తాయన్నారు. 90 టీఎంసీల కోసం 2023 లోనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు సాధించామని గుర్తు చేశారు. కాంగ్రెస్​ హయాంలో డీపీఆర్​ వెనక్కి వచ్చి ఏడాది అయినా ఉలుకు పలుకూ లేదన్నారు. 

పాలమూరు రంగారెడ్డి కాల్వలకు 2023 నవంబర్​లో టెండర్లు పిలిస్తే.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రద్దు చేసిందన్నారు. ‘‘పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్​ చెబుతున్నారు. కనీసం ఏడు గజాల కాలువైనా తవ్వారా” అని హరీశ్​ప్రశ్నించారు. నీళ్లపై మంత్రి ఉత్తమ్​తో బహిరంగంగా చర్చించేందుకు ప్రెస్​క్లబ్​, అసెంబ్లీ, ఏ టీవీ చానెల్​ అయినా తాను సిద్ధమేనన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల్లో 15,774 జీవోలను దాచేసిందని హరీశ్​ రావు ఆరోపించారు. 2023 డిసెంబర్​ 7 నుంచి 2025 జనవరి 26 వరకు 19,064 జీవోలు ఇవ్వగా.. అందులో కేవలం 3,290 జీవోలే పబ్లిక్​ డొమైన్​లో పెట్టారని మంగళవారం ట్వీట్ చేశారు. 

కేసీఆర్​ ప్రెస్​మీట్​తో డిఫెన్స్​లో ప్రభుత్వం 

కేసీఆర్​ ప్రెస్​మీట్​ తర్వాత ప్రభుత్వం డిఫెన్స్​లో పడిపోయిందని హరీశ్​ రావు అన్నారు. ఒక సీఎం రాత్రి 9.30 గంటలకు చిట్​చాట్​ పెట్టడం తన రాజకీయ జీవితంలో మొదటిసారి చూశానని చెప్పారు. సీఎంకు వాస్తు భయం పట్టుకున్నదని, సెక్రటేరియెట్​ గేట్లు మార్చినా, మరమ్మతులు చేసినా అటువైపు రావడం లేదని ఎద్దేవా చేశారు. 

కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లోనే మంత్రులతో మీటింగులు పెట్టుకుంటున్నారన్నారు. సర్పంచ్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు 4 వేలకుపైగా స్థానాలు రావడం చూసి అధికార పార్టీ భయపడుతున్నదని వ్యాఖ్యానించారు. రైతులకు మేలు చేసి ఉంటే.. ఎన్నికలు పెట్టొచ్చు కదా అని పేర్కొన్నారు.