
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళల ప్రేమ, పెళ్లి అప్పట్లో అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహ వేదిక ఎంపిక చైతన్యకు ఎంతో ప్రత్యేకమైంది. ఆయన తాత, సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వర రావు స్థాపించిన కుటుంబ వారసత్వ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఈ వివాహం జరిగింది. ఇటీవల చైతు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమాయణం
టాలీవుడ్ జగ్గు బాయ్ జగపతి బాబు నిర్వహించిన ZEE5 టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా'లో పాల్గొన్న నాగ చైతన్య తన ప్రేమకథ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. శోభితాను తాను ఎలా కలిశాననే విషయాన్ని చైతన్య వెల్లడించారు. మేమిద్దరం ఇన్‌స్టాగ్రామ్‌లో కలుసుకున్నాం. నా జీవిత భాగస్వామిని అక్కడ కలుస్తానని నేనెప్పుడూ అస్సలు ఊహించలేదు. ఒకరోజు, నేను నా క్లౌడ్ కిచెన్ 'షోయు' గురించి పోస్ట్ చేసినప్పుడు, ఆమె ఒక ఎమోజీతో కామెంట్ చేసింది. అక్కడి నుంచి నేను ఆమెతో ఛాటింగ్ చేయడం మొదలుపెట్టాను. కొద్ది రోజులకే మేమిద్దరం కలిశాం అని చైతు గుర్తుచేసుకున్నారు. కేవలం ఒక ఎమోజీతో మొదలైన ప్రేమ.. చివరికి వైవాహిక జీవితానికి దారి తీసిందని ముసిముసి నవ్వులతో చెప్పుకొచ్చారు.
'బుజ్జి తల్లి' పాటపై శోభిత అలక!
ఇటీవల చైతన్య నటించిన 'తండేల్' చిత్రం వంద కోట్ల వసూళ్లతో ఆయన కెరీర్‌లోనే తొలి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ఒక పాట విషయంలో శోభిత తనపై అలిగిందని చైతన్య సరదాగా చెప్పారు. 'బుజ్జి తల్లి' పాట విషయంలో ఆమె నాపై కోపం తెచ్చుకుంది. ఇది నిజానికి నేను ఆమెకు పెట్టిన ముద్దుపేరు. డైరెక్టర్ చందూ మొండేటిని నేనే అడిగి ఆ పాటలో ఈ పదాన్ని వాడించానని ఆమె అనుకుంది. కొన్ని రోజులు ఆమె నాతో మాట్లాడలేదు . కానీ నేను ఎందుకు అలా చేస్తాను?" అంటూ నవ్వుతూ చెప్పారు చైతు..
'శోభిత' లేని జీవితం లేదు
జగపతి బాబు అడిగిన రాపిడ్-ఫైర్ రౌండ్‌లో చైతు తన ప్రేమను మరోసారి నిరూపించుకున్నారు. మీరు దేని లేకుండా జీవించలేరు? అని జగపతి బాబు అడగ్గా, చైతన్య వెంటనే "శోభిత, నా భార్య!" అని సమాధానమిచ్చారు. తన జీవితంలో శోభితకు అధిక ప్రాధాన్యత ఉంది అని చెప్పారు యువసామ్రాట్. ప్రస్తుతం ఈ టాక్ షోలో నాగచైతన్య పంచుకున్న తన జీవిత విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగ చైతన్య గతంలో నటి సమంత రుత్ ప్రభును 2017లో వివాహం చేసుకున్నారు, అయితే 2021లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 2024లో ఆయన శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు. జీవితంలో ఎత్తుపల్లాలను చూసిన తర్వాత, చైతూ-శోభితా తమ కొత్త ప్రయాణాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు. అభిమానులు కూడా వీరిద్దరి బంధం ఎల్లప్పుడూ ఇలాగే బలంగా ఉండాలని ఆశిస్తున్నారు.