
కొల్చారం, వెలుగు: ఏడుపాయల సమీపంలో కొల్చారం మండల పరిధి హనుమాన్ బండల్ దగ్గర మంజీరా నది తీరంలో మహిషాసుర మర్దిని, నాగిని శిల్పాలు బయట పడ్డాయని చరిత్రకారుడు, లైబ్రేరియన్ బుర్ర సంతోష్ తెలిపారు. కిష్టాపూర్ గ్రామానికి చెందిన యూసఫ్ ఇచ్చిన సమాచారం మేరకు మంజీరా నది తీరంలో పరిశీలించగా ఆయా శిల్పాలను గుర్తించినట్టు తెలిపారు. అష్టభుజ మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారి శిల్పం ఉందన్నారు.
అది ఎంతో పురాతన శిల్పం అని ఎవరో విగ్రహాన్ని మంజీరా నదిలో నిమజ్జనం చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పురాతన శిల్పాలు మన చరిత్రకు, గత వైభవానికి ఆధారమైనవని అలాంటి వాటిని ఇలా నీళ్ల పాలు, మట్టి పాలు చేయొద్దన్నారు. ఇలాంటి చారిత్రక సంపదను కాపాడుకోవాలని, వీలైతే గుడిలోనే, సురక్షితంగా ఉండే చోటనో పెట్టాలని సూచించారు. లేదా గ్రామ చరిత్ర తెలిసేలా గ్రామ పంచాయితీ కార్యాలయంలో పెట్టాలన్నారు.