
దేశవిదేశాల్లో ఇండియన్ బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ షో ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారమవుతోంది. ఈ రియాలిటీ షో వస్తుందంటే చాలు కుటుంబ సభ్యులు అంతా టీవీల ముందు వాలిపోవాల్సిందే. అంతలా ఈ రియాలిటీ షోను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ వివిధ ఫార్మాట్ లలో గేమ్స్ ను ఆడుతూ రసవత్తరంగా సాగే ఈ షోకు భారీ టీఆర్పీ ఉండటంతో టెలికాస్టింగ్ కంపెనీలు కూడా కాసుల వర్షం చూస్తున్నాయి..
కన్నడ 'బిగ్‌బాస్' షో భారీ షాక్..
అయితే ఇప్పుడు కన్నడ 'బిగ్‌బాస్' రియాలిటీ షో అభిమానులకు భారీ షాక్ తగిలింది. సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ కన్నడ 12వ సీజన్‌కు ఊహించని అడ్డంకి ఎదురైంది. బెంగళూరు సౌత్ జిల్లాలోని బిడది వద్ద ఉన్న ఈ షో సెట్‌ను తక్షణమే మూసివేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ షో గ్రాండ్ లాంచ్ అయింది కూడా ఒక వారం క్రితమే. ఇంతలో ఈ పరిణామం ఎదురవడంతో షో భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితిని నెలకొంది.
ALSO READ :: ఆమె లేనిదే నా జీవితం లేదు..
వెల్స్ స్టూడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (Jolly Wood Studios & Adventures) సంస్థకు అక్టోబర్ 6వ తేదీన KSPCB నుంచి అధికారిక నోటీసు అందింది. స్టూడియో కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆ నోటీసు స్పష్టం చేసింది. అయినా వారినుంచి సరైన స్పందన రాకపోవడంతో కాలుష్య నియంత్రణ మండలి సీరియస్ అయింది. పర్యావరణ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమే ఈ చర్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఉల్లంఘనలేమిటి?
KSPCB తన నోటీసులో ప్రధానంగా రెండు అంశాలను పేర్కొంది. వాటిల్లో ప్రధానంగా భారీ స్థాయిలో ఏర్పాటుచేసి ఈ వినోద, స్టూడియో కార్యకలాపాలకు కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం వాటర్ , ఎయిర్ విషయాల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన 'కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్' , 'కన్సెంట్ ఫర్ ఆపరేషన్' అనుమతులను స్టూడియో యాజమాన్యం తీసుకోలేదు. స్టూడియో ప్రాంగణం నుంచి విడుదలవుతున్న మురుగునీరు శుద్ధి చేయకుండా నేరుగా పబ్లిక్ డ్రైన్‌లలోకి విడుదల అవుతోంది. ఇది జల కాలుష్యానికి దారితీస్తోందని బోర్డు గుర్తించింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి సీరియస్ అయింది.
సీజ్ చేయాలని ఆదేశం
పరిస్థితి తీవ్రత దృష్ట్యా బిగ్‌బాస్ నిర్వహకులకు KSPCB నోటీసు ఇచ్చింది. అంతే కాకుండా ఈ ఆదేశాలను పటిష్టంగా అమలు చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖలకు సమాచారాన్ని పంపింది. రామనాగర జిల్లా డిప్యూటీ కమిషనర్ ను సదుపాయాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది. BESCOM (విద్యుత్ సరఫరా సంస్థ) అధికారులను , స్థానిక ఇంజనీర్లను స్టూడియో ఆవరణకు విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని కోరింది.
గతంలోనూ హెచ్చరికలు
బిడది పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ బిగ్‌బాస్ సెట్ కర్ణాటకలోనే అతిపెద్ద రియాలిటీ షో లొకేషన్లలో ఒకటి. అయితే, ఈ స్టూడియో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం కొత్తేమీ కాదు. ఈ సంవత్సరంలో మార్చి 19, జూన్ 11 తేదీల్లో స్థానిక అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటికీ, స్టూడియో యాజమాన్యం తప్పనిసరిగా తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ బోర్డు క్లియరెన్స్‌ను పొందడంలో విఫలమైంది.
ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్‌లతో షో రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రేక్షకులను, ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. దీనిపై Vels స్టూడియోస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. షో నిర్మాణం ఆగుతుందా? తాత్కాలికంగా వేరే వేదికకు మారుతుందా? లేక ఈ సమస్యను పరిష్కరించి తిరిగి ప్రారంభమవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. కన్నడ టెలివిజన్ చరిత్రలో అత్యంత భారీ రియాలిటీ షోలలో ఒకటిగా పేరొందిన బిగ్‌బాస్-12 ఈ తొలి అడ్డంకిని ఎలా అధిగమిస్తుందో చూడాలి.