రైతు బంధు పేరుతో సైబర్ మోసం.. ముగ్గురి అకౌంట్లలోంచి లక్షా 25వేలు మాయం

రైతు బంధు పేరుతో సైబర్ మోసం.. ముగ్గురి అకౌంట్లలోంచి లక్షా 25వేలు మాయం

'సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అపరిచిత వ్యక్తులతో మీ బ్యాంకు  వివరాలు, వ్యక్తిగతసమాచారం పంచుకోకండి..' అని పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఎంత మొరపెట్టుకున్నా మోసపోయేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కేటుగాళ్లు.. తమ మాటలతో అమాయకులైన వారిని టార్గెట్ చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా, సైబర్ మోసగాళ్లు..  రైతు బంధు పేరుతో ఒకే ఊరికి చెందిన ముగ్గురి నుంచి లక్షా 25వేలు కాజేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

 కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన గాజర్ల సౌమ్య అనే మహిళ కుటుంబసభ్యులు చనిపోవడంతో ఇటీవల వారికి ఐదు లక్షల రైతు బీమా మంజూరు అయ్యింది. ఆ డబ్బులు మీ ఖాతాలో బదిలీ చేస్తామంటూ సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో (9873822391) నెంబర్ నుండి ఆమెకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ప్రభుత్వ అధికారినని పరిచయం చేసుకున్న అతడు.. సౌమ్యా కుటుంబసభ్యుల వివరాలు, రైతు భీమా వివరాలు పక్కాగా చెప్పడంతో ఆమె నిజమని నమ్మింది.

ఈ క్రమంలో కేటుగాడు.. సౌమ్య అకౌంటుకు 21 వేల రైతుబంధు డబ్బులు జమచేశామని, ఏదేని ఇతర ఖాతా నెంబర్ ఇస్తే దానికి మిగిలిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారని నమ్మబలికాడు. దీంతో ఆమె తమ ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ(తాళ్లపల్లి సంధ్య) ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆమె(సంధ్య) ఖాతాలో 9000 రూపాయలు జమ చేశానని.. అంతకంటే ఎక్కువ డబ్బు జమ కావడం లేదని మరొకరి ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరాడు. వెంటనే సంధ్య అనే మహిళ తన భర్త సుమన్ ఫోన్ నెంబర్ ఇచ్చింది. అతనికి కాల్ చేసిన నేరగాడు.. అతని నుంచి యూపీఐ వివరాలు తీసుకున్నాడు. పైగా ఈ ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం లేదని మరో వ్యక్తి ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరాడు. ఆయన ఆ సమయంలో తన పక్కనున్న రమేష్ అనే మరో వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

అనంతరం తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా..! లేదా అని బాధితులు చెక్ చేయగా.. వారి అకౌంట్లలో ఉన్న డబ్బులు కాస్త మాయమయ్యాయి. సంధ్య ఖతా నుండి 8,859, సుమన్ ఖాతా నుండి 18,549, రమేశ్ ఖాతా నుండి 98,000 ముగ్గురి ఖాతాల నుండి 1,25,408 రూపాయలు కాజేశాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ సమాచారం సైబర్ మోసగాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళిందో తెలియదని బాధితులు వాపోతున్నారు.