- కాపీరైట్ వెనక్కి తీస్కునేందుకు రూ. లక్షల్లో డిమాండ్
- మెటా వేదికల్లో కాపీరైట్ లోపం ఆసరాగా కొత్త దందా
- వరుసగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్న కంటెంట్ క్రియేటర్లు
- ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని పిల్
న్యూఢిల్లీ, వెలుగు: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా(ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ మాతృ సంస్థ) కాపీరైట్ వ్యవస్థలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రైం ముఠాలు కొత్త తరహా మోసాలకు తెరలేపాయి. డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను టార్గెట్‌గా చేసుకొని నకిలీ కాపీరైట్ కంప్లయింట్లు పెట్టి ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను సస్పెండ్ చేయిస్తున్నాయి. ఫేక్ కాపీరైట్ కంప్లయింట్లు వెనక్కి తీసుకుని, ఖాతాలను పునరుద్ధరించాలంటే రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలపై గత 20 రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ పుష్కర్ రాజ్ ఠాకూర్ సహా ఇతర క్రియేటర్లు పిటిషన్లు వేశారు. మెటా కాపీరైట్ విధానంలోని లోపాలను ఆసరగా తీసుకుని సైబర్ క్రైమ్ ముఠాలు చేస్తోన్న మోసాలను పిటిషన్లలో వివరించారు. ఒక్కసారిగా లక్షలాది ఫాలోవర్లు ఉన్న ఖాతాలు నిలిచిపోవడంతో అనేక మంది కంటెంట్ క్రియేటర్లు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నట్టు కోర్టుకు తెలిపారు. నితిన్ జోషి అనే క్రియేటర్ ఈ తరహ మోసాలపై ప్రజాహిత వాజ్యం(పిల్) కూడా దాఖలు చేశారు.
ఫేక్ కాపీరైట్ కంప్లయింట్లతో రెండు సార్లు తన ఖాతాను సస్పెండ్ చేయించారని.. దీంతో రూ. లక్షకుపైగా సైబర్ క్రిమినల్స్‌కు చెల్లించి, ఖాతాను పునరుద్ధించుకున్నట్లు తెలిపారు. ఈ మొత్తం సైబర్ క్రైమ్ వసూళ్ల ముఠాపై ప్రత్యేక దర్యాప్తు బందం(సిట్) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ముందస్తు నోటీసు లేకుండానే సోషల్ మీడియా వేదికలు వినియోగదారుల ఖాతాలను నిలిపివేసేందుకు అనుమతి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్–2021లోని నిబంధనలను కూడా ఆయన సవాలు చేశారు.
ఇవి సహజ న్యాయ సూత్రాలకు, జీవనోపాధి హక్కుకు విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే.. డబ్బులు ఇవ్వకపోతే తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను శాశ్వతంగా తొలగింపచేస్తానన్న ఓ సైబర్ నేరగాడు బెదిరించాడని, తాను రూ. 2 లక్షల దాకా ముట్టజెప్పాల్సి వచ్చిందని సీఏ భాగ్యశ్రీ ఠక్కర్ (8.91 లక్షల ఫాలోవర్లు) అనే కంటెంట్ క్రియేటర్ కోర్టుకు విన్నవించారు. కాగా, ఈ పిటిషన్లన్నీ హైకోర్టు ముందుకు త్వరలోనే విచారణకు రానున్నట్లు ఆయా పిటిషనర్లు తెలిపారు.
