సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌!

సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌!

హైదరాబాద్‌,వెలుగు: రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘ఎక్స్‌’ అకౌంట్‌ ‘TGCyberBureau’ హ్యాకింగ్‌కు గురైంది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేసే టీజీ సీఎస్‌బీ ‘ఎక్స్‌’ అకౌంట్‌లో హ్యాకర్లు రిప్లై పోస్టింగ్స్‌ చేస్తున్నారు. ట్రేడింగ్‌పై సూచనలు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పాటు ట్రేడింగ్‌ చేయాలంటూ సూచిస్తున్నారు. గత నెల 22 నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు మంగళవారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.

దీన్ని సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించకపోవడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీంతో ఎట్టకేలకు టీజీ సీఎస్‌బీ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ‘ఎక్స్‌’ అకౌంట్‌ను పునరుద్ధరించారు.సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసే విధంగా పోస్టులు చేస్తున్నారు. అయితే, ‘ఎక్స్‌’ అకౌంట్ హ్యాకింగ్‌పై సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్‌ స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. టీజీ సీఎస్‌బీకి చెందిన ‘ఎక్స్‌’ అకౌంట్‌ హ్యాక్ కాలేదని వెల్లడించారు.