మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. 15 కోట్ల సుపారీ

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. 15 కోట్ల సుపారీ
  • 8 మందిని అరెస్ట్ చేశాం: సీపీ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని, తాము ఆ కుట్రను ఛేదించి 8 మందిని అరెస్ట్ చేశామని  సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను  బుధవారం రాత్రి ఆయన మీడియాకు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చంపితే రూ.15 కోట్ల సుపారీ ఇస్తామని చెప్పి హత్యకు కుట్ర చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఫిబ్రవరి 23న ఫరూక్, హైదర్ అలీ అనే ఇద్దరు కొంపల్లి ఏరియా సుచిత్రలోని ఓ లాడ్జిలో ఉన్నారని, 25న ఆ ఇద్దరు బయటకు టీ తాగేందుకు వెళ్లినప్పుడు నాగరాజు, మరికొందరు వెంబడించి హత్య చేసేందుకు ప్రయత్నించారని సీపీ తెలిపారు. వారి నుంచి తప్పించుకున్న ఫరూక్, హైదర్ అలీ కొంత సేపటికి పేట్ బషీర్‌‌బాద్ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైట్ చేశారని చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు దర్యాప్తు చేయగా.. కీలక విషయాలు వెలుగు చూశాయన్నారు.

మహబూబ్‌నగర్‌‌కు చెందిన యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ అనే ముగ్గురు సుచిత్రలో వారిపై దాడికి యత్నించినట్లు దర్యాప్తులో తేలిందని, వారిని ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసి విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నాగరాజు తన స్టేట్‌మెంట్‌లో రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి హత్యకు కుట్ర చేశారని చెప్పాడని, దీని ఆధారంగా లోతుగా విచారించామని అన్నారు. కాల్ డేటా సాయంతో దర్యాప్తు ముందుకు సాగించామని, రాఘవేంద్ర రాజు, మన్నూరు రవి, మధుసూదన్ రాజు అనే ముగ్గురు ఢిల్లీలో ఉన్నట్లు తేలిందన్నారు. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారిని ట్రేస్ చేయగా.. ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్నట్లు గుర్తించామని, దీంతో అక్కడికి వెళ్లి ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి వద్ద నుంచి రెండు వెపన్స్ స్వాధీనం చేసుకున్నామని, వారిని విచారించగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర చేసినట్లు రాఘవేంద్ర రాజు చెప్పాడని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.15 కోట్ల డబ్బు చెల్లించేలా సుపారీ ఆఫర్ చేసి కిల్లర్‌‌ను మాట్లాడి కుట్ర చేశారని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని హత్యకు కుట్ర చేసిన రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, అమరేంద్ర రాజు, మధుసూదన్‌లకు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ షెల్టర్ ఇచ్చారని సీపీ తెలిపారు. తాము నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను వారు యూపీలో కొన్నట్లు తేలిందని, ఈ హత్య కుట్ర వెనుక పత్యక్షంగా, పరోక్షంగా ఎవరెవరికి ప్రమేయం ఉందన్నది త్వరలోనే తమ దర్యాప్తులో తేలనుందని చెప్పారు. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను నిందితులు ఎందుకు చంపాలనుకున్నారో ఇప్పుడే చెప్పలేమని, వారిని కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని సీపీ చెప్పారు.