గచ్చిబౌలి, వెలుగు: రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్‌తో పాటు అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ పలువురుని మోసం చేసిన ‘శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ఎండీ లక్ష్మీప్రసాద్, అకౌంటెంట్ వెంకటసత్య సుధీర్‌ను సైబరాబాద్ఎకనామిక్అఫెన్స్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన ప్రకారం.. ఏపీలోని రాజమండ్రికి చెందిన కె.లక్ష్మీప్రసాద్ 2017లో మాదాపూర్అరుణోదయ కాలనీలో శుభోదయం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ఎస్టేట్కంపెనీని స్టార్ట్చేశాడు.
విజయవాడకు చెందిన వెంకట సత్య ప్రసాద్ ను అకౌంటెంట్ గా, అనురాధ, రమణారెడ్డి అనే ఇద్దరిని డైరెక్టర్లుగా నియమించుకున్నాడు. లక్ష్మీప్రసాద్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాష్ పూర్ లోని పలు భూములను చూపెట్టి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాడు. తమ కంపెనీలో ఇన్వెస్ట్‌చేస్తే అధిక మొత్తంలో రిటర్న్స్ ఇస్తామని పైసలు వసూలు చేస్తున్నాడు. బై బ్యాక్ స్కీం పేరుతో 13 నెలలకు 50 శాతం, 18 నెలలకు 75 శాతం, 26 నెలలకు 100 శాతం లాభాలు, ఖిలాష్ పూర్ గ్రామంలో ఎకరం భూమి ఇస్తామని చెబుతున్నాడు.
అతని మాటలు నమ్మిన సిటీకి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డితోపాటు మరో13 మంది 3.16 కోట్లు ఇన్వెస్ట్‌చేశారు. తర్వాత లక్ష్మీప్రసాద్ కస్టమర్లకు ఎలాంటి లాభాలు ఇవ్వలేదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి కంపెనీ ఎండీ లక్ష్మీప్రసాద్, అకౌంటెంట్ సత్య సుధీర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కంపెనీ డైరెక్టర్లు అనురాధ, రమణ రెడ్డి పరారీలో ఉన్నారు.
