
- మత్తులో ఉన్న యువతిపై గ్యాంగ్ రేప్, మర్డర్
- కిస్మత్ పూర్ బ్రిడ్జి ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు
- ముందుగా ఓ ఆటో డ్రైవర్ లైంగికదాడి
- తర్వాత మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసి దారుణం
- తీవ్రంగా హింసించి, చంపినట్టు వెల్లడి
- ముగ్గురు నిందితులనూ అరెస్ట్ చేసిన పోలీసులు
గండిపేట, వెలుగు: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్ పూర్ బ్రిడ్జి వద్ద ఈ నెల 15వ తేదీన యువతి డెడ్ బాడీ దొరికిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కల్లు తాగి మత్తులో తూలుతూ వెళ్తున్న యువతిపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసి వదిలేయగా.. మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెపై లైంగికదాడి చేయడంతోపాటు దారుణంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ‘నిర్భయ’ ఘటన తరహాలో అతి దారుణంగా జరిగిన ఈ గ్యాంగ్ రేప్, మర్డర్ వివరాలను రాజేంద్ర నగర్ పోలీసులు మంగళవారం వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ప్రాంతానికి చెందినట్టుగా భావిస్తున్న 32 ఏండ్ల యువతి ఈ నెల14న పీవీఎన్ఆర్ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్143 దగ్గర మత్తులో తూలుతూ పోతున్నది. ఆ యువతి తాగి ఉందని గ్రహించిన లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్మేకా దుర్గారెడ్డి(33) ఆమె దగ్గరకు వచ్చాడు. బీరు, బిర్యానీ ఇప్పిస్తానని ప్రలోభపెట్టి ఆటోలో ఎక్కించుకున్నాడు. మత్తులో ఉన్న ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగికదాడి చేశాడు. తర్వాత ఆరాంఘర్ వద్ద కేఎల్‌సీసీ ఫంక్షన్‌హాల్ సమీపంలో వదిలి వెళ్లిపోయాడు.
కిడ్నాప్ చేసిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు..
ఆరాంఘర్ వద్ద తూలుతూ వెళ్లిపోతున్న యువతిని టోలిచౌకీ హకీంపేట్‌కు చెందిన ఆటో డ్రైవర్గులాం దస్తగిరి ఖాన్(26) చూశాడు. ఆమె గురించి టోలిచౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మొహమ్మద్ ఇమ్రాన్(25) అనే మరో ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసి చెప్పడంతో అతడు కూడా అక్కడకు వచ్చాడు. ఆరాంఘర్ చౌరస్తా పిల్లర్ నెంబర్ 306 వద్ద ఇమ్రాన్, దస్తగిరి ఆటోలో బాధితురాలిని బలవంతంగా ఎక్కించుకుని కిస్మత్పూర్మూసీ బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లారు.
అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై చిత్రహింసలు పెడుతూ అత్యాచారం చేశారు. చివరకు వెదురు బొంగులతో దారుణంగా కొట్టి చంపేసి పారిపోయారు. రెండు రోజుల తర్వాత ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు కొందరు యువతి డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించారు. యువతి డెడ్ బాడీపై బట్టలు లేకపోవడం, జననాంగాలపై సైతం తీవ్రంగా గాయాలై కనిపించడంతో రేప్, మర్డర్ జరిగినట్టుగా అనుమానించారు. కేసు నమోదు చేసి, రాజేంద్రనగర్ ఎస్ఓటీ సీఐ అంజయ్య నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజీ పట్టించింది..
యువతి చనిపోయిన చోట ఒక ప్లాస్టిక్ కవర్లో, చిన్న డిస్పోజబుల్ డబ్బాలో కల్లు కనిపించింది. దీంతో ఆమె గానీ, ఆమెను చంపిన నిందితులు గాని కల్లు తాగి ఉంటారని పోలీసులు అనుమానించారు. మర్డర్ ప్లేస్‌కు 200 మీటర్ల దూరంలో కల్లు కంపౌండ్ ఉండడంతో అక్కడ సీసీ కెమెరా ఫుటేజీని చెక్ చేశారు. పక్కనే ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న మరో సీసీ కెమెరా ఫుటేజీనీ చూశారు. దీంతో14వ తేదీన కల్లు కంపౌండ్ నుంచి ఒక ఆటో అటువైపు వెళ్లడం కనిపించింది.
ఆటో వెనక ఒక పువ్వు గుర్తును పోలీసులు గమనించి, దాని ఆధారంగా ఎంక్వైరీ చేయగా.. ఆటో గోల్కొండకు చెందిన ఓ వ్యక్తిదిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తాను ఆటో కిరాయికి ఇచ్చానని చెప్పాడు. ఆ రోజు కిరాయికి తీసుకుపోయిన వ్యక్తి పేరును వెల్లడించాడు. దీంతో నిందితుడిని పట్టుకుని విచారించగా, ఘటన వివరాలు బయటపడ్డాయి. కిడ్నాప్, గ్యాంగ్ రేప్, లైంగికదాడి, మర్డర్ అభియోగాలతో ముగ్గురు నిందితులనూ సోమవారం అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.