లోన్లు ఇప్పిస్తామని మోసం​.. 14 మంది అరెస్టు 

లోన్లు ఇప్పిస్తామని మోసం​.. 14 మంది అరెస్టు 
  • ఫేక్ లోన్ వెబ్ సైట్లు ఏర్పాటు 
  • అప్లై చేసుకున్నోళ్లకు ఫోన్లు 
  • ప్రాసెసింగ్ ఫీజు పేరుతో వసూళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: పర్సనల్‌‌ లోన్లు ఇస్తమంటూ మోసాలకు పాల్పడుతున్న ఇంటర్‌‌ ‌‌స్టేట్‌‌ గ్యాంగ్‌‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు మహిళలు సహా 14 మందిని అరెస్టు చేశారు. 17 సెల్‌‌ ఫోన్లు, ల్యాప్‌‌టాప్స్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం వివరాలు వెల్లడించారు. యూపీ లోని నోయిడాకు చెందిన అభిషేక్ మిశ్రా, రాజేంద్రకుమార్‌‌‌‌, బ్రిజేష్‌‌కుమార్‌‌ ఠాకూర్‌‌ ప్రముఖ లోన్ యాప్స్ ధని లోన్‌‌ బజార్‌‌‌‌, ది లోన్ ఇండియా, పైసా లోన్ హబ్‌‌, ముద్ర లోన్ ఫైనాన్ల పేరుతో నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేశారు. 

సెకండ్ హ్యాండ్‌‌ బేసిక్ ఫోన్లు, స్మార్ట్‌‌ ఫోన్లు, ల్యాప్‌‌ టాప్స్‌‌ కొని.. లోకల్ గా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. నిరుద్యోగ మహిళలను టెలీ కాలర్స్ గా తీసుకొని, హేమలత అనే మహిళను టీమ్ లీడర్​గా నియమించారు. ఈ ఫేక్ వెబ్ సైట్లలో లోన్ కోసం అప్లై చేసుకున్న వాళ్లకు వీళ్లు కాల్స్ చేసేవారు. లోన్ ఇస్తమంటూ బ్యాంక్ అకౌంట్‌‌, పాన్, ఆధార్‌‌‌‌ కార్డుల వివరాలు సేకరించేవారు. లోన్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ వసూళ్లు చేసేవారు. 

రాష్ట్రంలో 13 కేసులు..

పర్సనల్ లోన్‌‌ కోసం ధని లోన్‌‌ బజార్‌‌‌‌లో అప్లయ్ చేసుకున్న వ్యక్తికి గత నెల 17న దీపక్ శర్మ పేరుతో కాల్‌‌ చేశారు. పాన్, ఆధార్‌‌‌‌, పే స్లిప్‌‌ను వాట్సాప్‌‌ ద్వారా పంపించాలని చెప్పారు. రూ.5లక్షలు లోన్ శాంక్షన్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత లోన్‌‌ ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్‌‌టీ, ఇన్సూరెన్స్‌‌, ఇతర ఫీజులంటూ మొత్తం రూ.2,17,366 వసూలు చేశారు. అయినా లోన్ అమౌంట్ డిపాజిట్‌‌ కాకపోవడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా 13 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో నమోదైన 9 కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ నంబర్ల ఆధారంగా కేసును ఛేదించారు. 

హెల్త్ పాలసీ పేరుతో చీటింగ్ 

హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పేరుతో చీటింగ్ చేస్తున్న ఇద్దరిని సిటీ నార్త్‌‌ జోన్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు నెసపక్కంకు చెందిన గోపీకృష్ణ వెంకటకృష్ణ(32), కడ్డలూర్‌‌‌‌కు చెందిన నటరాజన్‌‌ అరుముగం(36) పాత నేరస్తులు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్​లోని తిరుమలగిరిలో యునైటెడ్ ఇండియా హెల్త్‌‌ ఆర్గనైజేషన్‌‌ పేరుతో కాల్‌‌ సెంటర్ పెట్టారు. మహిళలను టెలీకాలర్స్ గా నియమించుకొని.. తక్కవ ప్రీమియంకే హెల్త్ పాలసీ ఇస్తామంటూ కాల్స్ చేయించారు. ఒక్కో పాలసీకి రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున.. దాదాపు 55 మంది నుంచి రూ.5.5 లక్షలు వసూలు చేశారు. ఇదంతా ఫేక్ అని తెలిసి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.