గృహజ్యోతి వినియోగదారులు, రైతులకు లేఖలు : ప్రభుత్వం

గృహజ్యోతి వినియోగదారులు, రైతులకు లేఖలు : ప్రభుత్వం
  • సంక్రాంతి ముందు వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వ శ్రీకారం
  •     రాష్ట్ర వ్యాప్తంగా 52.82 లక్షల ఉచిత కరెంట్ గృహ వినియోగదారులు
  •     సుమారు రూ.3,593 కోట్లు సబ్సిడీ చెల్లింపు
  •     30 లక్షల రైతు కుటుంబాలకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
  •     అందరి ఇండ్లకు వెళ్లి లెటర్లు అందిస్తున్న సర్కారు

హైదరాబాద్, వెలుగు:  సంక్రాంతి పండుగ ముందర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చేసిన మంచి పనిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 83 లక్షల కుటుంబాలను కలిసి ఉచిత వ్యవసాయ సబ్సిడీ లేఖలు అందించే ఏర్పాట్లు చేసింది. నెలకు 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్​ వినియోగించుకుంటున్న 52.82 లక్షల మంది గృహజ్యోతి వినియోగదారులు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ పొందే 30 లక్షల మంది రైతన్నలకు వారి పేర్లపై లేఖలు రాసి ఇంటింటికి వెళ్లి అందిస్తున్నది. 

దీనికోసం విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో అధికారులు ఫీల్డ్​కు వెళ్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ పొందుతున్న వినియోగదారుల పేర్ల పైనే లేఖలు ముద్రించింది. విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామ గ్రామాన డ్రెస్​కోడ్​తో వెళ్లి మరీ ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వం పంపిన లెటర్లు అందిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకంతో కూడిన లేఖలను ఆఫీసర్లు అందచేస్తున్నారు.

గృహజ్యోతి లబ్ధిదారుల పేర్లపై లేఖలు

‘ప్రియమైన నూకల చంద్రయ్య గారికి.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు మీ కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మీరు వాడిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నది. ఇప్పుడు విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, ఆరోగ్యం కోసం ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. 

మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని 52,82,498 కుటుంబాలు జీరో విద్యుత్​ బిల్లుల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం ప్రారంభం నుంచి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు రూ.3,593 కోట్లు ప్రభుత్వం పూర్తిగా భరించి విద్యుత్​ సంస్థలకు నేరుగా చెల్లించింది’ అని గృహజ్యోతి వినియోగదారులకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకం తెలిసేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేరుతో లెటర్లపై ముద్రించారు.

30 లక్షల రైతన్నల కుటుంబాల ఉచిత విద్యుత్​

ఉచిత వ్యవసాయ విద్యుత్​కు సంబంధించి ‘ప్రియమైన కే.అంజయ్య గారు, మీకు ఉచిత విద్యుత్​ సరఫరా పథకాన్ని గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. మన ప్రజా ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మరింత మెరుగ్గా నాణ్యమైన ఉచిత విద్యుత్​ సరఫరా అమలు చేస్తున్నది. మీతో పాటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 30,03,813 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యత్​ సరఫరా అందించేందుకు మీ తరఫున మన ప్రజా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,499 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించింది. ఇది రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న దృఢమైన నిబద్దతకు స్పష్టమైన నిదర్శనం. 

రైతన్నల అభివృద్ధే.. రాష్ట్ర అభివృద్ధి అన్న అచంచల విశ్వాసంతో పనిచేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రజాహిత కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగించేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగను మీరు, మీ కుటుంబ సభ్యులు మరింత ఆనందోత్సహాలతో జరుపుకోవాలని కోరుతూ.. మీ.. భట్టి విక్రమార్క మల్లు’’అని లెటర్​పై రాశారు.

ఇదో గొప్ప కార్యక్రమం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పంపిణికీ సంబంధించి ఈ ఏడాది సుమారు రూ.17 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం చేపట్టిన ఇంత పెద్ద మంచి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల మంది వినియోగదారులందరికి తెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం పంపించిన లెటర్లను విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ద్వారా అందించే ఏర్పాట్లు చేసినం. 

ఇంటింటికి తిరుగుతున్న విద్యుత్ శాఖ సిబ్బంది

గ్రామాల వారీగా గృహజ్యోతి వినియోగదారులు, రైతుల పేర్లతో వచ్చిన లెటర్లను విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులతో తమ శాఖ సిబ్బందికి మధ్య ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ వినూత్న కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాయి. డిప్యూటీ సీఎం పేరుతో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో కూడిన సందేశ లేఖలను విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్నారు.

వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నంబర్‌‌‌‌‌‌‌‌తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు, సిబ్బంది డ్రెస్​కోడ్​తో వినియోగదారుల గృహాలను సందర్శించి మరీ అందజేస్తున్నారు.