- రేపు ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- రూ.66.33 కోట్లతో పూర్తయిన మొదటి దశ నిర్మాణం
- డిస్ట్రిబ్యూటరీలతో 36 చెరువులకు అందనున్న కృష్ణా జలాలు
- మరిన్ని చెరువులు నింపేందుకు రూ.34 కోట్లతో రెండో దశకు ప్లాన్
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో నీటి కరువు తీర్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్చేసిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్స్కీమ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇన్నేళ్లుగా పక్కనే సాగర్‌కాల్వల ద్వారా కృష్ణా జలాలు పారుతున్నా చుక్క నీరు కూడా తమ పొలాలకు అందడం లేదనే గిరిజన రైతుల ఆవేదనకు చెక్‌పడింది. వర్షపు నీరు, బోర్లు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసే భూముల్లో ఇప్పుడు సాగర్‌జలాలు సందడి చేస్తున్నాయి.
రూ.66.33 కోట్లతో గతేడాది సంక్రాంతికి శంకుస్థాపన చేసిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ఈనెల 13న సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమవుతుంది. నాలుగు నెలల్లో 9 కిలోమీటర్ల ప్రధాన పైప్‌లైన్ నిర్మాణం పూర్తి కావడంతో గత ఎండాకాలంలోనే కొన్ని చెరువులను నింపారు. ఆ తర్వాత క్రమంగా పెండింగ్ పనులను పూర్తి చేసి ఇప్పుడు రఘునాథపాలెం మండలంలో మొత్తం 36 చెరువులకు నీళ్లు అందించనున్నారు. దీంతో దాదాపు 4 వేల ఎకరాల్లో సాగు నీరందించేందుకు అవకాశం ఉంటుంది.
మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా..
వి.వెంకటాయపాలెంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ డీప్ కట్ దగ్గర మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ఈ మంచుకొండ లిఫ్ట్ పథకాన్ని చేపట్టారు. 450 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లను బిగించి, ఒక్కో దాని ద్వారా 20 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. మంచుకొండ గుట్ట దగ్గర అవుట్ లెట్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నాలుగు వైపులా డిస్ట్రిబ్యూటరీల ద్వారా చెరువులకు నీటిని తరలిస్తారు. రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఇవ్వగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఏడాదిలోనే పూర్తి చేశారు. గత ఎండాకాలమే తాత్కాలిక మోటార్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం కూడా పూర్తి కావడంతో పథకాన్ని ప్రారంభించనున్నారు.
9 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్ లైన్ ద్వారా మంచుకొండ దగ్గర డెలివరీ పాయింట్ కు నీళ్లు చేరతాయి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మరో 25 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఐదు డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్లతో చెరువులకు నీటిని అందించనున్నారు. ఈ లిఫ్ట్ ద్వారా మండలంలో సాగునీటి సమస్య తీరడంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ.34 కోట్లతో రెండో దశకు ప్లాన్..
ప్రస్తుతం రూ.66 కోట్లతో పూర్తయిన పనుల ద్వారా 36 చెరువులకు నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మండలంలో మిగిలిన ఇతర చెరువులు నింపేందుకు మరో 18 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులు అంచనా వేశారు. దీంతో ఇంకో రూ.34 కోట్లతో రెండో దశకు ప్రతిపాదనలు అందజేశారు. దానికి పరిపాలన అనుమతులు వస్తే కృష్ణా జలాలతో మండలం మొత్తం సస్యశ్యామలం కానుంది.
