చిట్టి తల్లి బతకాలంటే.. రూ. 30 లక్షలు కావాలి!

చిట్టి తల్లి బతకాలంటే.. రూ. 30 లక్షలు కావాలి!
  • పుట్టినప్పటి నుంచే తలసేమియా  
  • రక్తం ఎక్కిస్తేనే నిలుస్తున్న ప్రాణాలు 
  • ఆపరేషన్ ​కు రూ.30 లక్షలు అవుతాయన్న డాక్టర్లు
  • ఆర్థిక స్తోమత లేక దాతల కోసం 
  • పేద కుటుంబం ఎదురుచూపు

మద్దూరు, వెలుగు : పుట్టినప్పటి నుంచే  చిన్నారి మాయదారి జబ్బుతో బతుకు పోరాటం చేస్తోంది. ఐదేండ్లుగా ఆర్థిక కష్టాలు వచ్చినా కానీ.. చిన్నారి ప్రాణాలను కాపాడుకుంటున్నారు నిరుపేద తల్లిదండ్రులు. చిన్నారి జబ్బు శాశ్వతంగా నయం కావాలంటే రూ.30 లక్షలు అవసరమవుతాయి. దీంతో దాతల ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన హన్మంతు, అనిత దంపతులకు హన్సిక, ప్రసన్న, దినేశ్​పిల్లలు. వీరి రెండో కూతురు ప్రసన్న 2020 నవంబర్ లో పుట్టగా.. అప్పటినుంచే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మూడు నెలల తర్వాత నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో చూపించగా న్యూమోనియా  సోకిందని తేలింది. మెరుగైన వైద్యానికి హైదరాబాద్​నిలోఫర్​కు తీసుకెళ్లగా టెస్టుల్లో తలసేమియా ఉన్నట్టు నిర్ధారణ అయింది.

పాపకు రక్తకణాలు సరిగా ఉత్పత్తి కావడంలేదు. దీంతో  ప్రతి నెలకు ఒకసారి రక్తం ఎక్కిస్తూ.. తల్లిదండ్రులు కూతురిని బతికించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని కమలా ఆస్పత్రి సెంటర్ ఐదేండ్లుగా తలసేమియాకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేస్తూ రక్తం ఎక్కిస్తోంది. ప్రసన్న ఎల్​కేజీ చదువుతుండగా రక్తం ఎక్కించాలంటే ఒక్కోసారి బి పాజిటివ్​గ్రూప్  దొరక్కపోతుండగా డబ్బులు పెట్టి కొనేందుకు అప్పులు చేస్తున్నారు.

కాగా.. చిన్నారికి బోన్​మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్ ఆపరేషన్​చేస్తే వ్యాధిని శాశ్వతంగా నయం చేయొచ్చని డాక్టర్లు సూచించారు. అయితే.. ట్రీట్ మెంట్ కు రూ.30 లక్షలు ఖర్చవుతాయని, బెంగళూరులోని ఈషాన్ హెల్త్ కేర్ ఆస్పత్రిలో ఆపరేషన్​ చేస్తారని చెప్పారు.   నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారికి ఆపరేషన్​చేయించేంత ఆర్థిక స్తోమత లేదు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేసి, తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునేవారు ఫోన్ :  9676659336 కు ఫోన్ , గూగుల్ పే, లేదంటే SBI A/C : 32058485559 (Ifsc : SBIN0004694) మద్దూరు బ్రాంచ్ అకౌంట్ కు పంపించాలని కోరుతున్నారు.