వికారాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రులు, మహిళా ఐఎఎస్ అధికారుల వ్యక్తిగత విషయాలను ప్రసారం చేస్తున్న కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లు తమ పద్ధతి మార్చుకోవాలని తాండూర్ ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి సూచించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మాజీ జడ్పీటీసీ మహిపాల్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పుదోవ పట్టించినట్లే, ఇప్పుడు కూడా కొన్ని చానెళ్లు లేనిపోని ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా పాలన సాగిస్తుంటే, కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నిబద్ధత గల నాయకుడని గుర్తు చేశారు.
