మహిళల భద్రతకు పెద్దపీట

మహిళల భద్రతకు పెద్దపీట

రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అరాచకాలు పెరుగుతున్నాయి. బస్ స్టాపులు, ఆఫీసులు, ఆన్ లైన్,  మొబైల్ ఫోన్లలో ఆకతాయిలు వేధిస్తున్నారు. దాంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని.. ఐటీ కారిడార్ తో పాటు 6 జోన్లలో పోకిరీలపై పోలీసులు నిఘా పెడుతున్నారు . మఫ్టీ పోలీసింగ్, డెకాయ్ ఆపరేషన్లతో అమ్మాయిలను వేధిస్తున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. మొన్నటి వరకు ఐటీ కారిడార్ లో మహిళా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేశారు. ఇప్పుడు ఐటీ కంపెనీలన్నీ డే అండ్ నైట్ వర్క్ చేయిస్తున్నాయి. నైట్ టైం కూడా మహిళల భద్రత, రక్షణ కోసం సైబరాబాద్ షీ టీమ్స్ పనిచేయనున్నాయి. సైబరాబాద్ లో ఐటీ కారిడార్ తో పాటు... మహిళా హాస్టళ్లు ఎక్కువగా ఉండటంతో మహిళలపై వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 షీటీమ్స్ పని చేస్తున్నట్టు DCP అనసూయ చెప్పారు. కూకట్ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లోని.... బస్ స్టాప్ ల్లో నైట్ టైం డెకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నామన్నారు.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్లలో హరాస్ మెంట్ కేసులు, సోషల్ మీడియాలో వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని సైబరాబాద్ DCP అనసూయ చెప్పారు. షీటీమ్స్ కు 100 నుంచి 200 కేసులు ఇలాంటివే వస్తున్నాయి. గత 6 నెలల్లో షీటీమ్స్ కి 791 ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో 174 సెల్ ఫోన్ లో వేధింపుల కేసులు, 81 బ్లాక్ మెయిలింగ్ కేసులు వచ్చాయన్నారు DCP. బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి భద్రత కల్పిస్తున్నామన్నారు. నిందితులపై పిటీ కేసులతో పాటు నేర తీవ్రత బట్టి జైలు శిక్షలు పడేలా చూస్తున్నామన్నారు.  వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నాయి షీటీమ్స్ బృందాలు. ఏ కష్టం వచ్చినా డయల్ 100 కు కాల్ చేయాలంటున్నాయి. 24 గంటలు షీటీమ్స్ అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు పోలీసులు.