సైబర్ నేరాలతో 22,845 కోట్లు నష్టపోయిన జనం..లోక్సభకు వెల్లడించిన కేంద్రం

సైబర్ నేరాలతో 22,845 కోట్లు నష్టపోయిన జనం..లోక్సభకు వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: 2024లో సైబర్ నేరస్థుల వల్ల ప్రజలు రూ.22,845.73 కోట్లకు పైగా నష్టపోయారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌‌‌‌సభకు వెల్లడించింది. ఇది గతేడాది కంటే దాదాపు 206 శాతం ఎక్కువని హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. గతేడాది ఈ నష్టం రూ.7,465.18 కోట్లు నమోదైందని తెలిపారు. జాతీయ సైబర్ నేరాల రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్​సీఆర్​పీ), మంత్రిత్వ శాఖ ఐ4సీ నిర్వహించే సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌‌‌‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్​సీఎఫ్​ఆర్​ఎంఎస్) ప్రకారం.. 2024లో సైబర్ నేరస్థులు చేసిన ఆర్థిక మోసాల ఘటనలు 36,37,288 నమోదయ్యాయని సంజయ్​ చెప్పారు. 

అలాగే, 2022లో 10,29,026, 2023లో 15,96,493, 22,68,346 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆర్థిక మోసాలను వెంటనే నివేదించడానికి, మోసగాళ్లు నిధులను దుర్వినియోగం చేయడాన్ని ఆపడానికి 2021లో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌‌‌‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్​సీఎఫ్​ఆర్​ఎంఎస్)ను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. సీఎఫ్​సీఎఫ్​ఆర్​ఎంఎస్  ప్రకారం, ఇప్పటివరకు 17.82 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదు కాగా.. రూ. 5,489 కోట్లకు పైగా ఆర్థిక మొత్తాన్ని రికవరీ చేసినట్టు మంత్రి వెల్లడించారు.