
ఆర్మూర్, వెలుగు: ‘మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు రూ.10 వేలు పంపించు. కేసు నుంచి తప్పిస్తాం లేకపోతే కాళ్లు, చేతులు నరికేసి జైల్లో వేస్తాం’ అంటూ సైబర్ నేరగాళ్లు ఓ అమాయకురాలిని బెదిరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన యువతికి వాట్సాప్ కాల్ చేసిన సైబర్ క్రిమినల్స్ హిందీలో మాట్లాడారు. పోలీస్ డీపీతో ఉన్న నెంబర్ +923106173348 నుంచి సదరు యువతికి కాల్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను పోలీస్ ఆఫీసర్నని మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని చెప్పాడు. రూ. 10 వేలు పంపిస్తే వదిలేస్తామని, లేకపోతే కాళ్లు, చేతులు నరికేస్తామని బెదిరించారు.
బాధిత యువతి తండ్రి పేరు, కుటుంబీకుల వివరాలు కరెక్ట్‌గా చెప్పడంతో కంగుతిన్న యువతి తన దగ్గర అంత డబ్బు లేదని రూ. 5 వేలే ఉన్నాయని చెప్పి వేడుకుంది. పక్కింటి వాళ్ల ఇంటికి వెళ్లి ఫోన్ మాట్లాడించింది. దీంతో వారు యువతి తండ్రితో మాట్లాడించాలని కోరారు. యువతి తండ్రి ఏడుస్తున్నాడు అంటూ ఏడుపు శబ్ధం వినిపించారు. ‘ఇప్పుడు రూ. 5 వేలు పంపు, మిగతావి మళ్లీ పంపండి’ అంటూ ఫోన్ కట్ చేశారు.
తర్వాత యువతి తన తండ్రికి ఫోన్ చేయడంతో తాను బాగానే ఉన్నానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చిన కాల్ గా గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తర్వాత కూడా యువతికి అనేకసార్లు, వాట్సాప్ కాల్స్, మెసేజ్ లు చేయడంతో ఆందోళనకు గురైంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ లో కూడా శనివారం ఒకరికి ఇలాంటి కాల్ వచ్చింది. ‘నీ కూతురు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. డబ్బులు పంపకపోతే ఢిల్లీలో అరెస్టు చేసి జైల్లో వేయిస్తా’ అంటూ బెదిరించారు. సైబర్ నేరగాళ్లు పంథా మార్చి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.