- ఆయా కంపెనీల కరెంటు ఖాతాలను సేకరిస్తున్న ఏజెంట్లు
- ముంబై, దుబాయ్ హవాలా ఏజెంట్లకు చేరవేత
- అక్కడి నుంచి అకౌంట్లు ఆపరేట్ చేస్తున్న కేటుగాళ్లు
హైదరాబాద్, వెలుగు: మూతపడిన కంపెనీలను సైబర్ నేరస్తులు టార్గెట్ చేశారు. ఆయా కంపెనీల పేర్లతో ఉన్న కరెంట్ బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరాలకు వాడుకుంటున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏజెంట్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో నమోదైన సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) ఐదు రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐదుగురు డీఎస్పీలతో కూడిన మొత్తం 57 మంది సీఎస్‌బీ అధికారుల బృందం.. ఏపీ, కేరళ, మాహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులో 25 రోజుల పాటు సోదాలు నిర్వహించింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదైన 41 కేసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూతబడిన కంపెనీ ఫర్మ్ పేరుతో ఉన్న కరెంట్ అకౌంట్లను నేరస్తులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇలాంటిదే కేరళలోని ఓ కంపెనీ నిర్వాహకులకు రూ.6 లక్షలు చెల్లించి వారి ఖాతాను కొన్నారు.
మరో అకౌంట్‌లో రూ.5 లక్షలు సైబర్ క్రైం మనీ డిపాజిట్ కాగా.. దానిని విత్ డ్రా చేసుకున్నారు. అకౌంట్ ఇచ్చినందుకు సంబంధిత ఖాతాదురుకి ఏజెంట్లు రూ.2 వేలు ఇచ్చారు. మ్యూల్ అకౌంట్లు ఇచ్చిన వారి పేరున కంపెనీలు రిజిస్టర్ అయినట్లు సీఎస్ బీ అధికారులు గుర్తించారు. కేరళలో అత్యధికంగా ఏడుగురు గృహిణులు సహా మొత్తం 28 మందిని అరెస్ట్ చేశారు. వీరి పేరున కంపెనీలు ఉండగా.. నష్టాలతో మూసివేశారు. ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఏజెంట్ల ద్వారా సేకరించిన అకౌంట్లను దుబాయ్, ముంబైలోని హవాలా వ్యాపారులకు పంపుతున్నారు. అక్కడి నుంచి దుబాయ్ మీదుగా చైనా సహా ఇతర దేశాల్లోని సైబర్ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఇలా సైబర్ నేరగాళ్లకు చేరిన కరెంట్ అకౌంట్లలో ఆన్‌లైన్ లో కొల్లగొట్టిన మనీ డిపాజిట్ అవుతున్నది. ఇదంతా హవాలా, క్రిప్టో, బిట్ కాయిన్ల రూపంలో దేశం దాటుతున్నట్లు సీఎస్ బీ అధికారులు గుర్తించారు.
మ్యూల్ ఖాతాల కోసం ఏజెంట్ల నెట్‌వర్క్
ఇలాంటి కంపెనీల వివరాలను సైబర్ నేరగాళ్లు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) డేటా ఆధారంగా సేకరిస్తున్నారు. ఆయా కంపెనీల పేరుతో లోన్లు ఇప్పిస్తామని చెప్పడంతో పాటు అకౌంట్లు ఇస్తే పెద్ద మొత్తంలో కమీషన్లు ఇస్తామని అకౌంట్ హోల్డర్లకు ఆశచూపుతున్నారు. వీటితో పాటు సైబర్ నేరాల కోసమే.. షెల్ కంపెనీల తరహాలో ఫర్మ్‌ను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాటి పేరున ఖాతాలు ఓపెన్ చేసి విక్రయిస్తున్నారు. ఇందుకోసం దుబాయ్, ముంబైలోని హవాలా వ్యాపారాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక ఏజెంట్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఆపరేట్ చేస్తున్న మ్యూల్ అకౌంట్లకు సంబంధించి ఖాతాదారులు చిక్కినా.. అసలు నేరస్తులు దొరకడం లేదు. దీంతో సైబర్ నేరాలకు అడ్డుకట్టపడడం లేదు. ఇలాంటి మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు.
