రాష్ట్రంలో గాలివాన బీభత్సం.. 14 మంది మృతి

రాష్ట్రంలో గాలివాన బీభత్సం.. 14 మంది మృతి
  •  నాగర్​కర్నూల్ జిల్లాలో కోళ్లఫారమ్​ గోడ కూలి నలుగురి మృత్యువాత
  • పిడుగులు పడి ముగ్గురు.. కారుపై ఇటుకలు పడి మరొకరు కన్నుమూత 
  • సిద్దిపేట జిల్లాలో గోడ కూలి ఇద్దరు.. శేరిలింగంపల్లిలో గోడ కూలి మరో ఇద్దరు..
  • శామీర్ పేట్–కీసర దారిలో చెట్టు కూలి ఇద్దరు దుర్మరణం

నాగర్​కర్నూల్​టౌన్/కందనూలు/ములుగు/ కీసర/మియాపూర్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది మృత్యువాతపడ్డారు. నాగర్​కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే 8 మంది చనిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.

పట్టణాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు కరెంట్ లైన్ల మీద పడిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ఇంద్రకల్ రోడ్డులో కోళ్ల ఫారమ్ షెడ్డు గోడ కూలి ఓనర్ మల్లేశ్, ఆయన కూతురు అనూషతోపాటు పని చేసేందుకు నాగర్​కర్నూల్ నుంచి వచ్చిన అడ్డా కూలీలు చెన్నమ్మ, రాములు అక్కడికక్కడే చనిపోగా, మరో ఆరుగురు గాయాల పాలయ్యారు. గాలివాన రావడంతో వీరంతా షెడ్డులో తలదాచుకోగా, గోడకూలి మీదపడడంతో ప్రమాదం జరిగింది. 

గాయపడినవారిని సమీప దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. పిడుగులు పడి ఇదే జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో లక్ష్మణ్(13), బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్ గ్రామంలో గోపాల్ రెడ్డి (45), తిమ్మాజిపేట మండలం మారెపల్లిలో వెంకటయ్య (50) అనే రైతులు చనిపోయారు. నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రానికి సమీపంలోని మంతటి చౌరస్తా వద్ద కారులో కూర్చున్న వేణుగోపాల్ అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. కారు పక్కనే ఉన్న రేకుల షెడ్డు ఇటుకలు ఎగిరి గ్లాస్​పై పడగా, అద్దాలు గుచ్చుకోవడంతో వేణుగోపాల్ మృతిచెందాడు.

 అలాగే సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగరం గ్రామంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కోళ్ల ఫారం గోడ కూలి తూఫ్రాన్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్ (30), భాగ్యమ్మ (40)  మృతిచెందారు. సాయంత్రం చినుకులతో మొదలైన వానకు గాలి తోడవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆ సమయంలో రోడ్ల మీద ఉన్నవారు పరుగులు తీశారు. అధికారులు రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్​సిబ్బంది కూలిన స్తంభాలు, తెగిన తీగలను యుద్ధప్రాతిపదికన బాగు చేస్తున్నారు. 

బైకుపై చెట్టు పడి, గోడ కూలి.. నలుగురు మృతి 

ఈదురుగాలులు, భారీ వర్షంతో శామీర్ పేట్ లోని కీసర రహదారి పై ప్రయాణిస్తున్న బైకుపై చెట్టు కూలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. యాదాద్రి- భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి(48), అదే మండల పరిధిలోని ఆదిపురం గ్రామానికి చెందిన ధనుంజయ ఓ లాయర్ తో మాట్లాడేందుకు బైకుపై ఇంట్ర గ్రామం నుంచి శామీర్ పేట వైపు బయలుదేరారు. 

తిమ్మాయిపల్లి సమీపంలోకి రాగానే ఈదురుగాలులకు చెట్టువిరిగి, వారు ప్రయాణిస్తున్న బైకుపై పడింది. దీంతో నాగిరెడ్డి రాంరెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు.. ధనుంజయ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అలాగే, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో ఓల్డ్ హఫీజ్​పేట్ సాయినగర్​లోని ఓ ఇంటి నాల్గవ అంతస్తు గోడ కూలి పక్కనే ఉన్న రేకుల ఇంటిపై పడటంతో మూడేండ్ల బాలుడు చనిపోయాడు. 

మహ్మద్ అబ్దుల్ సమద్ అనే ఆ బాలుడి తల్లిదండ్రులు యూపీకి చెందినవారు. రోడ్డు పక్కన బట్టల వ్యాపారం చేస్తుంటారు. ప్రమాద సమయంలో వారు బయట ఉన్నారు. ఇదే దారిలో  బైకుపై వెళ్తున్న ఎండీ రషీద్ (45) అనే వ్యక్తిపైనా ఇంటి గోడ కూలి ఇటుకలు మీద పడ్డాయి. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.