దూసుకొస్తున్న జవాద్ తుఫాన్

దూసుకొస్తున్న జవాద్ తుఫాన్

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారిందని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. విశాఖపట్నానికి 420 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిలోమీటర్ల దూరంలో ‘‘జవాద్’’ తుఫాన్ కేంద్రీకృతమైందంది. ఇది శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత దిశను మార్చుకొని ఒడిశా వైపు వెళ్లి.. ఆదివారం పూరి వద్ద తీరాన్ని దాటే చాన్స్ ఉందని చెప్పింది. ఉత్తర కోస్తాంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సహా ఒడిశాలోని గజపతి, గంజాం, పూరి, నయగఢ్, ఖుద్రా, కటక్, జగత్ సింగ్ పూర్, కేంద్రపరా జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

ఉత్తర కోస్తాంధ్ర సహా ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం.. ఒడిశాలోని గజపతి, గంజాం, పూరి, జగత్ సింగ్ పూర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో పశ్చిమ బెంగాల్​లో కొన్ని ప్రాంతాల్లో.. ఆది, సోమవారాల్లో అస్సాం, మేఘాలయా, త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాన్ తీరాన్ని దాటే టైమ్ లో శని, ఆదివారాల్లో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. గంటకు 65 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఎన్డీఆర్ఎఫ్​ టీమ్స్ రెడీ... 
తుఫాన్ నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) టీమ్స్ రెడీ అయ్యాయి. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల్లో 46 టీమ్స్ ను మోహరించామని, మరో 18 టీమ్స్ ను రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉంచామని ఎన్డీఆర్ఎఫ్​డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ చెప్పారు. కాగా ఏపీ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్ అధికారులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా మీటింగ్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని, నిత్యావసరాలు స్టాక్ పెట్టుకోవాలని సూచించారు. ఆదివారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని ఏపీలో ఆదేశించారు. 11 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు మరో 4 టీమ్స్ అందుబాటులో ఉన్నాయని అక్కడి అధికారులు చెప్పారు.