సూపర్ సైక్లోన్.. భీకర్ తుఫాన్ మోంథా తీరం వైపు వేగంగా వచ్చేస్తోంది. 2025, అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయానికి.. మచిలీపట్నం తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. కాకినాడకు 180 కిలోమీటర్లు.. విశాఖపట్నం తీరానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తీరం వైపు వచ్చే క్రమంలో వేగం తగ్గినట్లు చెబుతున్నారు అధికారులు. తీరానికి సమీపించే కొద్దీ.. వేగం గంటకు 10 కిలోమీటర్లుగా ఉందని.. కొద్దిసేపు వేగంగా.. మరికొద్దిసేపు నిదానంగా కదులుతున్నట్లు చెబుతున్నారు అధికారులు.
తుఫాన్ గంట గంటకు బలపడుతూ.. సూపర్ సైక్లోన్ అంటే భీకర్ తుఫాన్ గా మారుతుందని.. తీరాన్ని టచ్ చేసే సమయంలో గాలులు 110 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని.. జనం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు.
28వ తేదీ మధ్యాహ్నం సమయానికే కోస్తా జిల్లాల్లో గాలుల తీవ్రత పెరిగిందని.. వర్షం మొదలైందని స్పష్టం చేస్తున్న అధికారులు.. మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
అత్యవసరం అయితే బయటకు రావాలని హెచ్చరిస్తూ.. జనం అంతా ఇళ్లల్లోనే ఉండాలని.. బయటకు రావొద్దని.. చెట్లు కూలే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. ఇక కోస్తా తీర ప్రాంతాల్లో ఈ రాత్రి అంటే 28వ తేదీ మంగళవారం రాత్రి ప్రయాణాలు పెట్టుకోవద్దని.. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు.
తుఫాన్ తీరం దాటిన తర్వాత ప్రచండ గాలులతోపాటు అతి భారీ వర్షాలు పడతాయని.. ప్రయాణాల్లో ఉంటే ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు అధికారులు. తీర ప్రాంతాల్లో.. కోస్తా జిల్లాల్లో ఈ రాత్రి ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నారు అధికారులు.
