రోడ్లకు ‘మొంథా’ దెబ్బ..రాష్ట్రవ్యాప్తంగా 230 కిలోమీటర్ల పరిధిలో ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసం

రోడ్లకు ‘మొంథా’ దెబ్బ..రాష్ట్రవ్యాప్తంగా 230 కిలోమీటర్ల పరిధిలో ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసం
  • 14 జిల్లాల్లో 334 చోట్ల డ్యామేజీ
  • తాత్కాలిక రిపేర్లకు రూ.7 కోట్లు
  • శాశ్వత మరమ్మతులకు రూ.225 కోట్లు అవసరం
  • సర్కారుకు ఆర్అండ్​బీ శాఖ నివేదిక

హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాను దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ రోడ్లు ధ్వంసం అయ్యాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలకు 230 కిలోమీటర్ల మేర రోడ్లు  దెబ్బతిన్నాయి. వీటిలో 61 కల్వర్టులు, బ్రిడ్జిలు ఉన్నాయి. మొత్తం 156 చోట్ల ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తగా, 69 చోట్ల ఆర్ అండ్​ బీ ఇంజినీర్లు పునరుద్ధరించారు. ఖరాబైన రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక రిపేర్ల కోసం రూ.7 కోట్లు, శాశ్వత రిపేర్ల కోసం రూ.225 కోట్లు అవసరమని సర్కారుకు ఆర్​ అండ్​ బీ శాఖ ఇంజినీర్లు నివేదిక పంపించారు. 

గురువారం సెక్రటేరియెట్​ నుంచి సీఎం రేవంత్​రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో దెబ్బతిన్న రోడ్ల వివరాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వివరించారు. ప్రధానంగా వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, నాగర్ కర్నూల్, ఖమ్మం, జనగాం జిల్లాలను మొంథా తుఫాను అతలాకుతలం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో 334 ప్రాంతాల్లోని 201 రోడ్ల మీదుగా వరద పొంగిపొర్లింది. ఖమ్మం జిల్లాలో వరద ఉధృతిని తక్కువగా అంచనావేసి రోడ్డుపై ముందకు వెళ్లడానికి ప్రయత్నించిన ఓ డీసీఎం వ్యాన్, అందులోని డ్రైవర్​ కొట్టుకుపోయారు.

 నేషనల్​ హైవే, స్టేట్​ హైవే రోడ్లు కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో బుధవారం నాటి తుఫాన్​ ఎఫెక్ట్ వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను బాగు చేయడానికి తాత్కాలిక రిపేర్ల కోసం రూ.7 కోట్లు, శాశ్వత మరమ్మతుల కోసం రూ.225 కోట్లు అవసరం అని ఆర్​అండ్​ బీ శాఖ ఇంజినీర్లు నివేదిక తయారు చేశారు. ఇందులో అత్యధికంగా వరంగల్​ జిల్లాకు రూ.52.25 కోట్లు, నాగర్​కర్నూల్​ జిల్లాకు రూ.49.44 కోట్లు, సిద్దిపేట జిల్లాకు రూ.40.19 కోట్లు, కొత్తగూడెం జిల్లాకు రూ.22.95 కోట్లు చొప్పున నిధులు కేటాయించాలని కోరారు.