ఆలుగడ్డ రైతుల పరేషాన్.. మొంథా వర్షాలకు దెబ్బతిన్న పంట

ఆలుగడ్డ రైతుల పరేషాన్.. మొంథా వర్షాలకు దెబ్బతిన్న పంట
  • దిగుబడులపై తీవ్ర ప్రభావం
  • మళ్లీ విత్తుతున్న కొందరు రైతులు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: మొంథా తుఫాను ఆలుగడ్డ రైతుల మీద తీవ్ర ప్రభావంచూపింది. ఈ సీజన్ లో ఆలు సాగు చేసిన రైతులు మొక్కలు ఎదగక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ఎదగని పైరును తొలగించి మళ్లీ విత్తుతున్నారు. జిల్లాలో ములుగు, వర్గల్, మర్కుక్, జగదేవ్పూర్, గజ్వేల్, రాయపోల్ మండలాలతో పాటు సిద్దిపేట డివిజన్ లోని కొన్ని గ్రామాల్లో ఆలుగడ్డల సాగు చేస్తున్నారు. చలికాలంలోనే సాగు చేసే ఆలుగడ్డలను ఈ ఏడాది సుమారు రెండు వేల ఎకరాల్లో విత్తుకున్నారు. 

అక్టోబరులో ఆలు విత్తనాలు నాటిన కొద్దిరోజుల్లోనే మొంథా తుఫాను కారణంగా అకాల వర్షాలు పడగా పైరు ఎదుగుదలపై ప్రభావం పడింది. అధిక వర్షాలతో పైరు పొలాల్లోనే కుళ్లిపోవడం, మొలకలు రాకపోవడం, మొలకెత్తినా మొక్కలు దృఢంగా ఎదగక పోవడం వంటి సమస్యలు తలెత్తాయి. 

పైరు తొలగిస్తున్న రైతులు

దీంతో కొందరు రైతులు పూర్తిగా పంటను తొలగించి కొత్తగా విత్తుతుండగా మరికొందరు మొక్కలు దెబ్బతిన్న చోట మాత్రమే తిరిగి విత్తుతున్నారు. అధిక వర్షాల వల్ల విత్తిన ఆలు పైరులో యాభై శాతం వరకు నష్టం వచ్చినట్లు భావిస్తుండగా దిగుబడులు నలభై శాతం వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితుల్లో ఆలు సాగు కొనసాగిస్తే నష్టాలు తప్పవని భావించిన మరికొందరు ఏకంగా ఆలుపైరును పూర్తిగా తొలగించి ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఆలుగడ్డ విత్తనాలను ఎక్కువగా పంజాబ్ లోని జలంధర్ నుంచి తెప్పించాల్సిరావడంవల్ల రవాణా, ఇతర ఖర్చులు ఎక్కువ. ఎకరా ఆలుగడ్డ సాగు ఖర్చు సుమారు 45 వేల వరకు వుంటుంది. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఎకరానికి పది నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఈసారి దిగుబడి తీవ్రంగా తగ్గనుంది. ఆలు పైరు దెబ్బతినడం, రెండోసారి ఆలస్యంగా విత్తడం వల్ల నష్టం తప్పదంటున్నారు. 

ఆదుకోవాలంటున్న ఆలు రైతు 

వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోయిన ఆలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఆలుగడ్డ సాగు మొదలు పెట్టిన రైతులంతా ఎంతో కొంత నష్టపొతున్నారు. మొంథా తుఫాను వల్ల ఆలు పంట నష్టపోయినా అధికారులు పంటను పరిశీలించలేదని రైతులు వాపోతున్నారు. పంటను చూసి రైతులకు అవసరమైన సూచనలు సలహాలు కూడా ఇవ్వలేదంటున్నారు. ఆలుగడ్డ పంట నష్టం అంచనా వేసి సహాయ చర్యలు ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

వర్గల్ మండలం అంబర్ పేట్ కు చెందిన రైతు మన్నె మహేశ్​ రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని ఆలుగడ్డ వేశాడు. విత్తిన కొద్ది రోజులకే మొంథా తుఫాను వల్ల విత్తనం సరిగా మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలు దృఢంగా లేవు. ఆలు విత్తడానికి దాదాపు రూ. లక్ష ఖర్చు చేసాడు. ఎదిగీఎదగని పైరును అలాగే ఉంచితే దిగుబడి సరిగా రాదని, పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నాడు. ఇది ఒక్క మహేశ్​ పరిస్థితి మాత్రమే కాదు .. సిద్దిపేట, గజ్వేల్ డివిజన్ల లో ఆలుగడ్డ సాగు చేస్తున్న వందలాది మంది పరిస్థితి ఇదే. 

పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు

ప్రస్తుత సీజన్ లో ఆలు సాగుచేస్తున్న రైతులకు పెట్టుబడులుకూడా తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఆలు విత్తితే అధిక వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో విత్తిన ఆలు సాగులో దాదాపు సగంవరకు నష్టపొయ్యే పరిస్థితి ఉంది. ఆలు సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎం.రాజు, రైతు వేలూరు